Begin typing your search above and press return to search.

అలా చేస్తే కరోనా రాదంటూ కిటుకులు చెప్పిన రాందేవ్

By:  Tupaki Desk   |   15 March 2020 1:40 PM IST
అలా చేస్తే కరోనా రాదంటూ కిటుకులు చెప్పిన రాందేవ్
X
కరోనా.. కరోనా. ఇప్పుడు ఎక్కడ విన్నా.. ఏం చేస్తున్నా.. ఇష్టం ఉన్నా.. లేకున్నా.. కరోనా ప్రస్తావన లేకుండా గంట కూడా గడవని పరిస్థితి. అందరికి దూరంగా ఉన్నా.. ఫోన్ లో వచ్చే కరోనా అలెర్టులు.. పుష్ నోటిఫికేషన్లు కరోనాను గుర్తుకు తెస్తున్నాయి. దీనికి తగ్గట్లే యావత్ ప్రపంచం ఇప్పుడు కరోనా వైరస్ కు వణికిపోతుంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి దెబ్బకు మానవాళి భయం గుప్పిట్లో గజగజలాడుతోంది.

ఇలాంటివేళ.. కరోనా గురించి అంత భయపడాల్సిన అవసరం లేదని.. దాన్ని ఎలా ఎదుర్కోవచ్చో టిప్స్ చెప్పటం షురూ చేశారు యోగా గురువు రాందేవ్ బాబా. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన గుక్క తిప్పుకోకుండా చెబుతున్నారు.

ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండటంతో ఎవరికి వారు కాపాడుకోవచ్చని.. జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రయాణిస్తున్నప్పుడు.. నిలబడి ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే చాలంటున్నారు. ఇతరులకు దూరంగా ఉంటూ బస్సులు.. రైళ్లలో ప్రయాణం చేయాలన్నారు. ప్రయాణ సమయంలో శానిటైజర్ల వినియోగం తప్పనిసరి అని.. దాన్ని వాడటం ద్వారా కరోనా వ్యాపించకుండా జాగ్రత్త పడొచ్చన్నారు.

వీలైనంతగా మాస్కులు ధరించటం మంచిదంటున్న ఆయన.. రోగనిరోధక శక్తిని పెంచుకోవటం కూడా అవసరమని చెప్పారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవటం కోసం నిత్యం యోగా సాధన చేయాలన్న ఆయన.. సహజనమైన జీవనశైలిని అనుసరించటం చాలా అవసరమన్నారు. ఉబ్బసం.. గుండె జబ్బులు.. మధుమేహంతో ఇబ్బంది పడుతూ.. చికిత్స తీసుకునే వారు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాందేవ్ బాబా నోటి నుంచి ఏం చెప్పినా.. తిరిగి తిరిగి యోగా దగ్గరకు మాత్రం వస్తారనటంలో సందేహం లేదు.