Begin typing your search above and press return to search.

ఇలా బిడ్డ పుట్టగానే.. అలా ఆధార్ అంకె..?

By:  Tupaki Desk   |   22 Dec 2015 5:25 AM GMT
ఇలా బిడ్డ పుట్టగానే.. అలా ఆధార్ అంకె..?
X
దేశంలోని ప్రతిఒక్కరికి ఆధార్ అంకెను అందించేందుకు వీలుగా ప్రభుత్వం భారీగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. యూపీఏ సర్కారు హయాంలో మొదలైన ఈ భారీ కార్యక్రమం ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చిందని చెప్పాలి. ఇప్పటికీ ఆధార్ లేని వారి సంఖ్య కోట్లలో ఉంది. ఇలా.. చేర్చాల్సిన వారి విషయంలో ఏం చేయాలన్నది ఒకటైతే.. అప్పుడే పుట్టిన శిశువుల విషయంలో మరేం చేయాలన్నది మరో సమస్య. దీనికి.. పరిష్కారంగా ఒక విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. అప్పుడే పుట్టిన బిడ్డకు ఆధార్ సంఖ్యను కేటాయించే పద్దతిని అమలు చేయాలని భావిస్తున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టును హర్యానా రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈ పైలెట్ ప్రాజెక్టు సక్సెస్ కావటంతో.. దీన్ని అన్ని రాష్ట్రాలకు అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అప్పుడే పుట్టిన చిన్నారి చేతి వేలి ముద్రల్ని సేకరించి.. ఆ పాపకు ఆధార్ అంకెను ఇచ్చే కార్యక్రమాన్ని హర్యానా సర్కారు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. ఇందుకోసం శిశువుల వేలిముద్రల స్కానర్ కు అనుగుణంగా ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. ఆధార్ ను కనుగుడ్డు ఆధారంగా నమోదు చేయటం తెలిసిందే. అప్పుడే పుట్టిన శిశువులకు సంబంధించి ప్రత్యేక స్కానర్లతో ఆధార్ సంఖ్యను కేటాయిస్తారు. ఇందుకోసం శిశువు తల్లిదండ్రుల బయోమెట్రిక్ వివరాల్ని తీసుకుంటారు.

ఇలా కేటాయించిన ఆధార్ సంఖ్యను శిశువుకు 10 నుంచి 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆధార్ కు జత చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అదే జరిగితే.. దేశ వ్యాప్తంగా అందరికి విశిష్ఠ సంఖ్య కేటాయింపు పెద్ద కష్టం కాదు. కాకుంటే.. ఈ విధానాన్ని మిగిలిన రాష్ట్రాల్లో అమలుకు సంబంధించి పక్కాగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.