Begin typing your search above and press return to search.

చంద్రబాబు యాక్టర్.. ఈనాడు - జ్యోతి - టీవీ5 డైరెక్షన్

By:  Tupaki Desk   |   30 Nov 2020 5:35 PM GMT
చంద్రబాబు యాక్టర్.. ఈనాడు - జ్యోతి - టీవీ5 డైరెక్షన్
X
ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్షాల సవాళ్లు, ప్రతిసవాళ్లు, నిరసనలతో హోరెత్తింది. ఈ రోజు అసెంబ్లీలో మూడు మీడియా సంస్థలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. "చంద్రబాబు నాయుడు యాక్టర్ అయితే ఏబీఎన్, టివి 5 మరియు ఈనాడు స్క్రీన్ ప్లే రాస్తారు. అదే ఏపీ రాష్ట్రంలో మీడియా దయనీయమైన పరిస్థితి. అధికార పార్టీని చెడుగా చూపించడం కష్టమని ప్రతిపక్ష పార్టీ అధిపతి గ్రహించారు. అందుకే ఇలా మీడియాతో అభాసుపాలు చేస్తున్నారు. మేము రైతులకు మంచి చేస్తున్నందున ఆయన జీర్ణించుకోవడం లేదు’ అని వైఎస్ జగన్ కడిగిపారేశారు.

ప్రతి రైతుకు మంచి ఎలా చేస్తామో వివరించడానికి మేము ప్రయత్నిస్తున్నప్పుడు, ప్రతిపక్షానికి చెందిన కొంతమంది అడ్డుతగులుతున్నారని.. ముఖ్యంగా డ్రామా నాయుడు అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు.

ఇలా అసెంబ్లీలో అల్లరి చేస్తే హీరో అయిపోతానని బాబు కలలు గంటున్నాడని జగన్ ఆడిపోసుకున్నారు. అది తనకు ప్రజల్లో మార్కులు తెచ్చేది కాదని ప్రతిపక్ష పార్టీ అధినేత అర్థం చేసుకున్నారని.. అందుకే అకస్మాత్తుగా పోడియంపై కూర్చుని అరవడం ద్వారా కొత్త నాటకాన్ని ప్రారంభించాడని జగన్ దుయ్యబట్టారు.

ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన పద్ధతి అసెంబ్లీలో ఉంటుందని.. నేను కూడా అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడూ వచ్చి పోడియం వద్ద ఇలా కూర్చోలేదని జగన్ వివరించారు. రాజకీయాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే పెద్దమనిషి ఇలా చేస్తాడని ఊహించలేదని జగన్ విమర్శలు గుప్పించారు.

ఇక టీడీపీ మీడియాపై జగన్ అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరిగారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, టివి 5 లకు రైతుల సమస్యలు పట్టవని.. ప్రతిపక్ష పార్టీ అధిపతిని మార్షల్స్ తీసుకెళ్తున్న చిత్రాలను మాత్రమే వారు వేస్తారని జగన్ విమర్శించారు. అది మన రాష్ట్రంలో ఉన్న పనికిరాని మీడియా దుస్తితి అని జగన్ ఎద్దేవా చేశారు.