Begin typing your search above and press return to search.

ఏపీ ఉద్యోగులు : బాబుకు ఇంతకంటే చాన్స్ ఉండదేమో...?

By:  Tupaki Desk   |   31 Aug 2022 11:30 AM GMT
ఏపీ ఉద్యోగులు : బాబుకు ఇంతకంటే చాన్స్ ఉండదేమో...?
X
ప్రభుత్వ ఉద్యోగులు ఎపుడూ టీడీపీకి వ్యతిరేకమే అని చరిత్ర చెబుతున్న సత్యం. ఒక్క 2014లో మాత్రం విభజన తరువాత ఏపీని తీర్చిదిద్దే సమర్ధత అనుభవం బాబుకు మాత్రమే ఉన్నాయని భావించి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో బాబుకు ఓటేసారు. అయితే బాబు దాన్ని నిలబెట్టుకోలేదు అన్న మాటా ఉంది. మొత్తానికి చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి సవాలక్ష కారణాలలో ఉద్యోగుల వ్యతిరేకత కూడా ఒకటి.

వారికి అలా టీడీపీ మీద వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం సీపీస్ రద్దు విషయంలో చంద్రబాబు సర్కార్ ఏమీ చేయలేకపోయింది. దాంతో బాబుని ఓడించాలనుకున్నారు. అదే టైమ్ లో జగన్ సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. తాము సీఎం అయిన వరం రోజుల వ్యవధిలో సీపీఎస్ రద్దు ఫైల్ మీద సంతకం పెడతాను అని జగన్ ఇచ్చిన బోల్డ్ హామీకి ఉద్యోగులు మొత్తం ఫిదా అయ్యారు.

దాంతో జగన్ కి బంపర్ విక్టరీ దక్కింది. ఇది నిజం. అయితే జగన్ పవర్ లోకి వచ్చాక మడతేశారు. సీపీఎస్ రద్దు అంటే ఎంత కష్టమో ఆయనకు తెలిసివచ్చింది. ఇక చూస్తే దేశంలో మనిషి జీవన కాలం పెరిగింది. ఒకపుడులా పరిస్థితి లేదు. దాంతో ఓల్డ్ పెన్షన్ అమలు చేస్తే ఆర్ధికంగా గుదిబండగా మారుతుంది అని వైసీపీ సర్కార్ కి తెలిసింది. అంతే కాదు ఉద్యోగం చేస్తున్న వారికి ఇచ్చదాని కంటే పెన్షన్ రూపంలో భారీ మొత్తం ఇవ్వాల్సి ఉంటుందని లెక్కలు చెప్పడంతో అసలు కధ అర్ధమైంది.

ఈ నేపధ్యంలో ఆ హామీని అటకెక్కించేశారు. ఈ మధ్యలో రెండేళ్ళు కరోనాతో కొట్టుకుపోయింది. ఏపీ విభజనతో అసలే కునారిల్లింది. ఇక కరోనా వచ్చి మరింతగా దిగజార్చింది. దాంతో జీతాలు ఇవ్వడమే కష్టమవుతున్న వేళ సీపీఎస్ రద్దు కు ఎస్ చెబితే ఖజానకు పెను భారం అవుతుంది అన్న లెక్కలతోనే వైసీపీ ఆగింది. దాంతో వయా మీడియాగా జీపీఎస్ అని మరో దాన్ని తెచ్చిపెట్టింది. అయితే దానికి ఉద్యోగులు ఒప్పుకోవడంలేదు. చేయమని అంటున్నారు.

ఒక విధంగా చంద్రబాబు నాడు ఇచ్చిన కాపుల బీసీ రిజర్వేషన్ లాంటి హామీయే ఇది. నేరుగా జగన్ ఇరుక్కున్నారు. ఇక విపక్షాలు అయితే అమలు చేయమంటాయి. కానీ తాము అమలు చేస్తామని చెప్పవు. వాటికి తెలుసు. ఈ లోతుపాతులు. అందరి కంటే అనుభవం నిండుగా ఉన్న చంద్రబాబుకు సీపీఎస్ రద్దు అన్నది అసలు కుదిరే వ్యవహారం కాదని బాగా తెలుసు. అందుకే ఆయన ఉద్యోగుల ఆందోళనకు మద్దతు అని అంటున్నారు.

వారిని ప్రభుత్వం అణచివేతకు గురి చేస్తోందని విమర్శిస్తున్నారు తప్ప తాను పూనుకుని సీపీఎస్ రద్దు చేస్తాను అని చెప్పడంలేదు. అయితే దీని వల్ల ఉద్యోగులు టీడీపీ వైపు వస్తారా బాబు పట్ల సానుభూతి చూపిస్తారా అంటే చెప్పలేని పరిస్థితి. అయితే ఎంతో కొంత బాబు మీద అనుకూలత ఉంటుందనే ఆయన ఇలా ప్రకటనలు ఇస్తున్నారు అనుకోవాలి.

ఏపీలో వైసీపీని దించాలంటే బాబునే కుర్చీ మీదకు ఎక్కించాలి. అయితే బాబు సీపీఎస్ రద్దు విషయంలో తన విధానం ఏంటో 2014 నుంచి 2019 మధ్యలో చెప్పేశారు. దాంతో ఆయనను తెస్తే ఇక శాశ్వతంగా సీపీఎస్ రద్దు గురించి మరచిపోవడమే. అందువల్లనే ఉద్యోగులు రాజకీయంగా తమకు మద్దతు ఇచ్చే పార్టీ ఏదీ లేదనే ఆలోచిస్తున్నారు.

తమ ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం కాదు సీపీఎస్ రద్దు చేస్తామని ఏదైనా పార్టీ చెబితే ఓటేయడానికి వారు రెడీగా ఉన్నారు. మరి అలాంటి గోల్డెన్ చాన్స్ ని బాబు వదులుకుంటున్నారా అంటే ఇప్పటికి ఇలాగే కనిపిస్తోంది. అయితే బాబు ఎన్నికల ముందు తన విజయావకాశాలు చూసుకుని ఏమైనా తక్కువ ఉంది అంటే అపుడు సీపీఎస్ రద్దు కి పచ్చ జెండా ఊపినా ఊపవచ్చు అని అంటున్నారు.

అందువల్లనే ఇపుడు ఏపీలో జగన్ సర్కార్ ని కార్నర్ చేస్తూనే మిగిలిన పక్షాలు తమ డిమాండ్ కి జై కొట్టేలా ఉద్యోగులు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు ఇప్పటికైతే సీపీస్ రద్దు అన్నది జరిగే పని కాదు అనుకుంటున్నారు అని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.