Begin typing your search above and press return to search.

మాజీ మంత్రికి బాబు హ్యాండ్ ఇచ్చేస్తారటగా... ?

By:  Tupaki Desk   |   30 Jan 2022 12:30 AM GMT
మాజీ మంత్రికి బాబు హ్యాండ్ ఇచ్చేస్తారటగా... ?
X
ఆయన రాజకీయం ఉవ్వెత్తున ఎగిసింది. బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని అంతా భావించారు. అలాగే ఆయన దూకుడు కూడా సాగింది. శ్రీకాకుళం వంటి వెనకబడిన జిల్లా నుంచి యువ నేతగా ముందుకు వచ్చిన కోడ్రు మురళీమోహనరావు వైఎస్సార్ ని నమ్ముకుని పాలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2004 ఎన్నికల్లో ఆయన తొలిసారి ఎచ్చెర్ల నుంచి పోటీ చేసి నాటి టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి మీద గెలిచారు. ఇక 2009 నాటికి నియోజకవర్గాల పునర్విభజనతో ఆయన రాజాం కి మారి రెండవ మారు అదే ప్రతిభా భారతి మీద మళ్ళీ గెలిచారు. ఈ టెర్మ్ లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు.

ఒక విధంగా ఏపీ విడిపోకుండా ఉంటే ఆయన మరింత ఉజ్వలంగా వెలిగేవారు. కానీ విభజన‌తో 2014 ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడారు. 2019 నాటికి టీడీపీ నుంచి అదే సీటు నుంచి పోటీ చేసినా విజయం దక్కలేదు. ఇక 2019 ఎన్నికల తరువాత కోండ్రు బాగా తగ్గిపోయారు. ఆయన టీడీపీలో కిమిడి కళా వెంకట‌రావు ద్వారా వచ్చారు. కళాకే ఆ తరువాత కళ తగ్గడంతో కోండ్రుకు కూడా ఇబ్బంది అవుతోంది.

ఈ నేపధ్యంలో మూడు రాజధానులకు మద్దతుగా కోండ్రు అప్పట్లో మాట్లాడడం కూడా మైనస్ అయింది. దాన్ని పార్టీలో ప్రత్యర్ధులు అనుకూలంగా మార్చుకున్నారు. ఇపుడు రాజాం టీడీపీలో ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మదే హవాగా ఉంది. చంద్రబాబు సైతం ఈ యువ నాయకురాలి మీదనే దృష్టి పెట్టారని అంటున్నారు. ఆ మధ్యన ఆమె బర్త్ డే వేళ బాబు స్వయంగా గ్రీట్ చేసి మరీ సర్ప్రైజ్ ఇచ్చారు. దీంతో ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ రావడం ఖాయమని అంటున్నారు.

ఇక కోండ్రుకి ఈసారి షాక్ ఇచ్చేస్తారని కూడా టీడీపీ వర్గాల మాట. కోండ్రు మళ్ళీ పార్టీ మారే చాన్స్ కొట్టిపారేయలేమని తమ్ముళ్ళు అధినాయకత్వానికి చెప్పారని టాక్. ఇక కోండ్రుకు ఇపుడు అదే దారి అని కూడా అంటున్నారు. ఆయన వెళ్తే వైసీపీలోకి వెళ్లాలి. లేకపోతే బీజేపీలోకి వెళ్లాలి. కోండ్రు అనుచరుల ఆలోచనలు చూస్తే ఆయన టికెట్ ఇస్తే వైసీపీలోకి వెళ్తారని అంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు మీద అయితే వ్యతిరేకత జనంలో సహజంగా ఉంది. దాంతో పాటు కోండ్రు 2009లో అక్కడ గెలిచిన వారు కావడంతో బలం ముంది. మరి కోండ్రుకు బాబు హ్యాండ్ ఇస్తే చేయి ఇచ్చి పైకి లేపడానికి జగన్ సిద్ధంగా ఉన్నారా. చూడాలి.