Begin typing your search above and press return to search.

నవంబర్ 1 గురించి బాబు ఆశలు...అసలు ఏం జరగనుంది...?

By:  Tupaki Desk   |   26 Oct 2022 11:30 AM GMT
నవంబర్ 1 గురించి బాబు ఆశలు...అసలు ఏం జరగనుంది...?
X
ఏపీకి రాజధానికి అమరావతికి సంబంధించిన విచారణ సుప్రీం కోర్టులో నవంబర్ 1న జరగనుంది. ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ యూ యూ లలిత్ నాయకత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుని విచారిస్తోంది. ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ తో పాటు అమరావతి పరిరక్షణ కమిటీ, మరో ముగ్గురు వేసిన పిటిషన్ల మీద కూడా విచారణ చేస్తారు.

మరో వారం రోజూలలో అంటే నవంబర్ 8న పదవీ విరమణ చేయబోతున్న లలిత్ ఈ విచారణను చేపట్టడం ఒక విశేషం అయితే ఈ విచారణ ఒక్క రోజులో తేలిపోతుందా లేక సుదీర్ఘంగా కొనసాగుతుందా అన్నది కూడా ఆసక్తి కలిగించే అంశం. రాష్ట్ర ప్రభుత్వం స్టే ఇమ్మని కోరింది.

ఒకవేళ ప్రభుత్వం తరఫున దాఖలైన పిటిషన్ లోని వాదనలు చూసి కరెక్ట్ అనుకుంటే హై కోర్టు తీర్పు మీద స్టే సుప్రీ కోర్టు ఇచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కి విలువ ప్రాధాన్యత పెద్దగా లేదనిపిస్తే కొట్టేయవచ్చు. అపుడు కూడా విచారణ సత్వరమే తేలిపోతుంది. అది కాదు అనుకుంటే రెండు పక్షాల వాదనలు విని ఈ కేసులో న్యాయం ఏది అనిపిస్తే ఆ విధంగా తీర్పునకు వస్తారు.

అయితే ఇందులో ప్రభుత్వ పిటిషన్ లో వాదన పస లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లుగా ఉన్నారు. అందుకే ఆయన తన పార్టీ సమీక్షలలో నవంబర్ 1న అమరావతి విషయం మీద విచారణ ఉందని, రాజధాని వ్యవహారం తేలిపోతుందని చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే వైసీపీ వర్గాలు మాత్రం తమకు హై కోర్టు తీర్పు మీద స్టే లభిస్తుంది అని ఆశాభావంతో ఉన్నాయి అంటున్నారు. కొన్ని కీలకమైన మౌలికమైన అంశాలు రాజ్యాంగప్రమైనవి తాము లేవనెత్తాం కాబట్టి స్టే వస్తుంది అని వైసీపీ వర్గాలు ఆశపడుతున్నాయి.

ఇక ఈ కేసు విషయంలో లోతైన విచారణ జరగాలని సుప్రీం కోర్టు భావిస్తే మాత్రం తీర్పు రావడానికి సుదీర్ఘ కాలం పట్టవచ్చు అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు అమరావతి విషయం నవంబర్ 1న తేలిపోతుంది అని భావిస్తున్నారనే చర్చ సాగుతోంది. మొత్తానికి అమరావతి రాజధాని రగడకు దేశ అత్యున్నత న్యాయ స్థానం ఒక కీలకమైన తీర్పు తుది తీర్పు వెలువరిస్తుంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.