Begin typing your search above and press return to search.

బాబు ఘనత... తనకు తానే శత్రువు

By:  Tupaki Desk   |   23 Jan 2020 7:49 AM GMT
బాబు ఘనత... తనకు తానే శత్రువు
X
రాజకీయాల్లో సుధీర్ఘ ప్రస్తావనమంటూ బీరాలు పలికే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు... తనను ఆజాత శత్రువుగా అభివర్ణించుకుంటారు. తనకు అసలు శత్రువులే లేరంటూ కూడా తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవడంతో పాటుగా తనను తానే ఆకాశానికి ఎత్తేసుకుంటారు. ఫ్యాక్షన్ కక్షల రాయలసీమ కు చెందిన తాను ఆ ఫ్యాక్షన్ కు ఆమడ దూరంగా ఉంటున్నానని కూడా చెప్పుకుంటారు. బాబు మాటల్లో ఏ మేర నిజముందో తెలియదు గానీ... బాబుకు బయటి శత్రువులు పెద్దగా లేకున్నా... ఆయనకు ఆయనే శత్రువు. వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా... బాబుకు బాబు మాత్రమే శత్రువు అనేందుకు ఇప్పుడు చాలానే ఉదాహరణలు ఉన్నాయన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

గతంలో బాబు అనుసరించిన వ్యూహాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు ఇప్పుడు ఆయనను ప్రజల ముందు విలన్ గా నిలబెడుతున్న తీరు కూడా ఆసక్తికరమే. ఈ తరహా దృష్టాంతాలన్నింటినీ ఒక్కటొక్కటిగా పరిశీలించుకుంటూ వెళితే... బాబుకు బాబు మాత్రమే శత్రువు అని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. తన సొంతూరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గం నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన చంద్రబాబు... రెండో సారే ఓటమి పాలు కావడంతో ఆపై ఆ నియోజకవకర్గం వైపు చూసింది లేదు. సొంత నియోజకవర్గాన్ని వదులుకున్నా కూడా రాజకీయంగా .జిత్తులమారి ఎత్తులు వేస్తూ సాగిన చంద్రబాబు అంచెలంచెలు ఎదిగారనే చెప్పాలి. ఎన్ని మెట్లు ఎక్కినా.. చివరకు తనకు ఏం జరిగిందన్న దాని పై చంద్రబాబు విశ్లేషణ చేసుకోరని, కేవలం తన వాదనను బలంగా వినిపించేందుకే ప్రాధాన్యం ఇస్తారని కూడా చెప్పాలి. ఈ క్రమంలోనే తనకు తానే శత్రువు అన్న మాటకు చంద్రబాబుకు అచ్చుగుద్దినట్లు సరిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్థానంలో చోటుచేసుకున్న కొన్ని కీలక పరిణామాలను పరిశీలిద్దాం పదండి.

% తన రాజకీయ గురువు రాజగోపాలనాయుడు పుణ్యంతో రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకున్న చంద్రబాబు... చంద్రగిరి ప్రజల మన్ననలను పొందడాని కంటే కూడా కాంగ్రెస్ పార్టీ నాటి అధినేత్రి ఇందిరాగాంధీ దృష్టిలో పడేందుకే ప్రాధాన్యం ఇచ్చారట. ఈ క్రమంలోనే ఆయన 1978 ఎన్నికల ప్రచారంలో నేండ్రగుంట నుంచి పాకాల వరకు ఏకంగా 10 కిలోమీటర్ల మేర బ్యానర్లు కట్టారట. ఆ తర్వాత మంత్రిగా అయిన తర్వాత కూడా తన జిల్లా చిత్తూరుకు గానీ, తన నియోజకవర్గం చంద్రగిరికి గానీ పెద్దగా ఏమీ చేయలేదు. ఫలితంగానే ఆ తర్వాతి ఎన్నికల్లో చంద్రబాబుకు చంద్రగిరిలో ఘోర పరాజయం దక్కింది.

% ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసిన చంద్రబాబు... వెంటనే తన మామ ఎన్టీఆర్ పంచన చేరిపోయారు. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించడం మొదలెట్టారు. ఎన్టీఆర్ కు ఆయన పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మరో సీనియర్ నేత ఉపేంద్రలను దూరం చేసే వ్యూహాలకు పదును పెట్టారు. ఫలితంగా ఎన్టీఆర్ కు చంద్రబాబే దూరమైపోయారు. అయితే ఎవరు ఎలా పోయినా తనకు పెద్దగా పట్టింపు లేదన్న దిశగా ఆలోచించిన చంద్రబాబు... ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచేశారు.

% అయితే ఎన్టీఆర్ కు వెన్నుపోటు ద్వారా అధికారం చేతికి వస్తే తన బాగు కోసమే నిత్యం ఆలోచించిన చంద్రబాబు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించిన దాఖలా లేదనే చెప్పాలి. ఇందుకు నిదర్శనంగానే విద్యుత్ చార్జీలు పెరిగాయి. సాగు దండగన్నారు. హైదరాబాద్ ను రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారు. ఫలితంగా 2004 ఎన్నికల్లో తనపై సానుభూతి ఉన్నా కూడా ఓటమి పాలయ్యారు.

% విపక్ష నేతగా ప్రజల తరఫున చంద్రబాబు ఏనాడైనా పోరాడారా? అలాంటి మాటే ఉత్పన్నం కాదు. ఎందుకంటే... తన కోసం కాకుండా చంద్రబాబు ఇతరుల కోసం పోరాటం సాగించిన సందర్భం అసలు లేదనే చెప్పాలి. మొత్తంగా చంద్రబాబు నిజ స్వరూపం ఏమిటన్న దానిని అర్థం చేసుకున్న జనం... 2009లోనూ ఓడించారు.

% 2014లో రాష్ట్రం విడిపోవడం... బీజేపీ, జనసేనల సహకారంతో ఎలాగోలా తిరిగి అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు.. ఈ దఫా కూడా జనాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అమరావతి రాజధాని లో తన వాళ్ల బాబోగులు, తన బాగోగులు మాత్రమే చూసుకున్నారు. ఐదేళ్లు ఎంజాయ్ చేసి.. రాజధాని ని కేవలం గ్రాఫిక్స్ లోనూ చేపించి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఫలితంగా మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు.

% ఇక ఇప్పుడు చంద్రబాబు సాగిస్తున్న అమరావతి పరిరక్షణ ఉద్యమంపై జనాల్లో ఏ కోశానా సానుభూతి లేదనే చెప్పాలి. అంతేకాకుండా మొన్న అసెంబ్లీ లో రాజధాని ని అమరావతి లోనే కొనసాగించాలంటూ ఏకంగా వయసు లో చిన్నవాడైనా జగన్ కు దండం పెడుతున్నానంటూ చంద్రబాబు చెప్పడం తో పాటు రెండు చేతులెత్తి మొక్కినా కూడా ఆయన పట్ల జనం లో సానుభూతి అయితే రాలేదు. అంతేకాకుండా చంద్రబాబు ఆధ్వర్యం లో జరుగుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యామానికి జనం మద్దతు దక్కడం లేదు.