Begin typing your search above and press return to search.

టీడీపీకి బీజేపీ లవ్ లెటర్ రాస్తుందా?

By:  Tupaki Desk   |   11 Aug 2021 7:40 AM GMT
టీడీపీకి బీజేపీ లవ్ లెటర్ రాస్తుందా?
X
రాజ‌కీయాలు ఒక్కొసారి.. మంచి ల‌వ్‌స్టోరీని త‌ల‌పిస్తాయి. మ‌రోసారి రివెంజ్ స్టోరీలా క‌నిపిస్తాయి. మొత్తానికి రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్ప‌లేని ప‌రిస్థితి. శ‌త్రువులు.. మిత్రులుగా మార‌డం.. మిత్రులు శ‌త్రువులు అవ‌డం రాజకీయాల్లో సాధార‌ణ‌మే. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై మ‌ళ్లీ బీజేపీ ప్రేమ వొల‌క‌బోయ‌డ‌మే కార‌ణం. తిరిగి టీడీపీతో జ‌ట్టు కట్టేందుకు మోడీ సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

2014 ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పొత్తు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. అప్పుడు ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబు నాయుడు.. అటు కేంద్రంలో మోడీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పుడంతా బాగానే సాగింది. కానీ ఆ త‌ర్వాత ఏపీకి ప్ర‌త్యేక హోదా స‌హా ఇత‌ర అంశాల‌పై విభేధాలు రావ‌డంతో బీజేపీతో జ‌న‌సేన‌, టీడీపీ బంధం తెచ్చుకున్నాయి. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో మోడీకి వ్య‌తిరేకంగా జాతీయ స్థాయిలో కూట‌మి ఏర్పాటుకు చంద్ర‌బాబు భారీ ఎత్తున్న ప్ర‌య‌త్నాలు కూడా చేశారు. కానీ ఆయ‌న వ్యూహాలు ఫ‌లించ‌క పోగా.. ఇటు యువ నేత జ‌గ‌న్ ధాటికి ఆయ‌న ప‌త్తా లేకుండా పోయారు. ఉన్న అధికారాన్నీ పోగొట్టుకున్నారు. జ‌న‌సేన కూడా వామ‌ప‌క్షాల‌తో క‌లిసి పోటీ చేసి చ‌తికిలబ‌డింది. దీంతో బాబు ఒంట‌రైపోయారు.

ఇక జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల నిర్ణ‌యంపై వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ తిరిగి మోడీతో చేతులు క‌లిపారు. కానీ టీడీపీ మాత్రం ఒంట‌రిగానే సాగుతోంది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఏపీలో పుంజుకోవాలంటే జ‌న‌సేన‌ను మాత్ర‌మే న‌మ్ముకుంటే ఫ‌లితం లేద‌ని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్న‌ట్లు ప్ర‌చారం జోరుగా సాగుతోంది. జ‌న‌సేన‌కు క్షేత్ర‌స్థాయిలో బ‌లం లేదు. క్రీయాశీల‌క‌మైన కార్యక‌ర్త‌లు త‌క్కువే. అందుకే జ‌న‌సేన‌ను న‌మ్ముకోలేని ప‌రిస్థ‌తి ఉంద‌ని చెప్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి టీడీపీతో జ‌ట్టు కట్టి పోటీ చేసేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ దిశ‌గా అడుగులు ప‌డే అవ‌కాశం ఉంద‌నీ రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు. అందుకే మ‌ళ్లీ బాబుపై ప్రేమ చూపిస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది.

ఊహాగానాలు నిజ‌మై బీజేపీ తిరిగి టీడీపీతో పొత్తు కుదుర్చుకంటే అది బాబుకూ మేలు చేసేదే. ప్ర‌స్తుతం సంక్షేమ ప‌థ‌కాల‌తో దూసుకెళ్లోన్న జ‌గ‌న్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబు ఒంట‌రిగా ఢీ కొట్ట‌డం జ‌ర‌గ‌ని ప‌ని. ఇప్ప‌టికే ఆయ‌న‌కు వ‌య‌సు మీద ప‌డుతోంది. యువ నాయ‌కుడు లోకేశ్‌ను న‌మ్ముకునే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌ను ఓడించాల‌నే ఆయ‌న‌కు ఓ అండ కావాలి. అదే ఇప్పుడు బీజేపీ రూపంలో ఎదురువుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. దీంతో అటు టీడీపీ.. ఇటు బీజేపీ రెండు లాభ‌ప‌డ‌తాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.