Begin typing your search above and press return to search.

జగన్ ఈ నిర్ణయానికి బాబే కారణం

By:  Tupaki Desk   |   25 May 2019 1:50 PM GMT
జగన్ ఈ నిర్ణయానికి బాబే కారణం
X
గెలుపులో భారీతనం వచ్చింది.. అదీ తన పాలనలో చూపించాలని.. హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉండాలని ఏపీ నూతన సీఎంగా ప్రమాణం చేయనున్న వైసీపీ అధినేత నిర్ణయించుకున్నట్టు తెలిసింది.. ప్రమాణ స్వీకారాన్ని సాదాసీదాగా.. నిరాడంబరంగా నిర్వహించాలని జగన్ తన ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులతో ఈరోజు ఉదయం జరిగిన సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది.

అమరావతిలోని తాడేపల్లిలో ఈరోజు ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు సమావేశమై శాసనసభాపక్ష నేతగా జగన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఈరోజు సాయంత్రం జగన్, ముఖ్యనాయకులు హైదరాబాద్ వెళ్లి తీర్మాన ప్రతిని గవర్నర్ కు అందజేస్తారు. అనంతరం 30న విజయవాడలో నిర్వహించే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తారు.

అయితే ప్రమాణ స్వీకారం మాత్రం నిరాడంబరంగా నిర్వహించాలని జగన్ యోచిస్తున్నారు. ఇందుకు చంద్రబాబు పాలనే నిదర్శనంగా కనిపిస్తోందని అంటున్నారు. చంద్రబాబు ఏపీ లోటు బడ్జెట్ లో ఉన్నా.. అప్పుల్లో ఉన్నా కూడా హంగూ ఆర్భాటాలంటూ విదేశాలకు చెక్కేయడం.. పాలనలో భారీతనం.. విచ్చలవిడిగా దుబారా ఖర్చు చేయడం.. పుష్కరాలకు సైతం సినిమా డైరెక్టర్లతో హంగులకు పోవడం వంటి వాటిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకింది.

అందుకే జగన్ తన పాలనలో భారీతనం ఉండాలే కానీ.. సౌకర్యాలు, సభల్లో కాదని.. ఇది ముందు నుంచే ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. అంతేకాదు సీఎంగా ఒక్కరూపాయి జీతం తీసుకోవాలనే ప్రతిపాదనను కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రజలు కట్టబెట్టిన అఖండ మద్దతును దుర్వినియోగం కాకుండా ప్రజలకే ప్రభుత్వ ప్రయోజనాలు కట్టబెట్టాలని..అందుకోసం సీఎంగా తాను.. మంత్రులు భారీతనానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.