Begin typing your search above and press return to search.

బాబు మోహన్ మమ్మల్ని అంత మాట అంటారా?

By:  Tupaki Desk   |   10 July 2016 4:12 PM GMT
బాబు మోహన్ మమ్మల్ని అంత మాట అంటారా?
X
ఎవరు జాగ్రత్తగా ఉన్నా లేకున్నా నేతలు.. అందునా అధికారపార్టీలో ఉన్న నేతలు జాగ్రత్తగా ఉండాలి. వారి నోటి నుంచి వచ్చే మాటలు ఆచితూచి ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బంది ఎక్కువ. అయినప్పటికీ ఆ విషయాన్ని తరచూ మర్చిపోతున్న ప్రజాప్రతినిధులు. తాజాగా అలాంటి తప్పునే చేశారు ప్రముఖ హాస్య నటుడు.. ఆందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్. అల్లాదుర్గం మండలాన్ని సంగారెడ్డి జిల్లా లో కలపాలంటూ రిలే నిరాహార దీక్షను నిర్వహిస్తున్నారు.

దాదాపుగా తొమ్మిది రోజుల నుంచి నిర్వహిస్తున్న ఈ దీక్షపై ఆందోల్ ఎమ్మెల్యే బాబూ మోహన్ చేసిన వ్యాఖ్యపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము చేస్తున్న దీక్షకు మద్దుతుగా ఒక్కరోజు కూడా కూర్చోని బాబూ మోహన్ అందుకు భిన్నంగా.. పనీపాటా లేకుండా ఉన్న వారే దీక్షలు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయటంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బాబూమోహన్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు బాల్ రాజ్.. బాబూ మోహన్ కు మతి భ్రమించిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసే సమయంలో ఒక్కరోజు కూడా ఆందోళనలతో పాల్గొనని బాబూమోహన్.. ఆంధ్రాపార్టీ అయిన టీడీపీ నుంచి టీఆర్ ఎస్ లోకి వచ్చి ప్రజలను కించపరిచేలా మాట్లాడటం మానుకోవాలంటూ హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న వారికి మద్దతుగా నిలవటమో లేదంటే.. ఏమీ పట్టనట్లుగా కామ్ గా కూర్చోవాలే కానీ.. దీక్ష చేస్తున్న వారిపై ఇలా వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం మంచిది కాదన్న మాట పలువురు నోట వినిపిస్తోంది.