Begin typing your search above and press return to search.

కేసీఆర్, కేటీఆర్ లదీ నరుకుడే: బాబుమోహన్

By:  Tupaki Desk   |   15 Oct 2018 12:21 PM IST
కేసీఆర్, కేటీఆర్ లదీ నరుకుడే: బాబుమోహన్
X
కేటీఆర్ ను సీఎం చేయడానికే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని టీఆర్ఎస్ నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన నటుడు, తాజామాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ సమరభేరి సభలో ఆయన మాట్లాడారు. తండ్రీకొడుకులిద్దరూ నరుకుడే అన్నట్టు వ్యవహరిస్తున్నారని హాట్ కామెంట్ చేశారు. నీళ్లు ఇవ్వకముందే ఓట్లు అడుగుతున్నారని.. వద్దంటే తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇప్పుడు వెళ్లగొట్టారని ధ్వజమెత్తారు.. దళితున్ని సీఎం చేస్తానని కేసీఆర్ మోసగించాడని మండిపడ్డారు..

తెలంగాణ వచ్చిందని ఆనందపడ్డానని.. కానీ తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమేనా అని బాబుమోహన్ ఫైర్ అయ్యారు. దళితులను గౌరవించే పార్టీ బీజేపీ అని.. రాష్ట్రపతిగా దళితున్ని చేసినందుకే ఈ పార్టీలో చేరానని వివరణ ఇచ్చారు.

నరేంద్ర మోడీ దేశంలో ఒక్క పైసా కూడా అప్పు తేలేదని.. కానీ తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల కోట్లు అప్పు అయ్యాయని బాబు మోహన్ మండిపడ్డారు. సంగారెడ్డి తాజా మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అసమర్థుడని.. పొద్దున లేస్తే మంత్రి హరీష్ రావు ఇంటి గేట్ దగ్గరే ఉంటాడని ఎద్దేవా చేశారు. ఇటువంటి వ్యక్తిని గెలిపించవద్దంటూ బాబుమోహన్ కోరారు.

ఇక ఇదే సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి సదానంద గౌడ కూడా కేసీఆర్ పై దుమ్మెత్తిపోశారు. ఆయన ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో సచివాలయానికి వెళ్లని ఏకైక సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు.