Begin typing your search above and press return to search.

ఫార్మ్‌ హౌస్ దాట‌ని కేసీఆర్ ఓ ముఖ్య‌మంత్రా?

By:  Tupaki Desk   |   10 Oct 2018 4:38 PM GMT
ఫార్మ్‌ హౌస్ దాట‌ని కేసీఆర్ ఓ ముఖ్య‌మంత్రా?
X
టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ - తెలంగాణ అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ఆ పార్టీ మాజీ నాయ‌కుడు - ప్ర‌స్తుత బీజేపీ నేత బాబుమోహ‌న్ విరుచుకుప‌డ్డారు. అనూహ్య రీతిలో ముంద‌స్తుకు వెళ్లిన గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ రికార్డు స్థాయిలో ఒక్క‌సారే 105 మంది అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ జాబితాలో త‌న పేరులేకోపోవ‌డంతో తీవ్రంగా హ‌ర్ట‌యిన బాబుమోహ‌న్ కొద్దికాలం వేచి చూసి అనంత‌రం కాషాయ కండువా క‌ప్పుకొన్నారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షా స‌మ‌క్షంలో పార్టీ మారిన బాబుమోహ‌న్‌...తాజాగా ఆయ‌న తెలంగాణ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా గులాబీ ద‌ళ‌ప‌తిపై దుమ్మెత్తిపోశారు. ఫార్మ్‌ హౌస్ దాట‌ని కేసీఆర్ ఓ ముఖ్య‌మంత్రా అంటూ విరుచుకుప‌డ్డారు.

ఈప్ర‌పంచంలో ఏ ముఖ్య‌మంత్రి కూడా స‌చివాల‌యానికి వెళ్ల‌కుండా ప‌రిపాల‌న చేయ‌లేద‌ని బాబుమోహ‌న్ ఎద్దేవాచేశారు. ఎమ్మెల్యేల‌కు - మంత్రుల‌కు క‌న‌ప‌డ‌కుండా ఫార్మ్‌ హౌస్‌ లో ముసుగేసుకొని ప‌డుకున్న ముఖ్య‌మంత్రి ఈయ‌న ఒక్క‌డేన‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌ని - రోడ్ల‌పైనే క‌త్తులు.. గొడ్డ‌ల్ల‌తో హ‌త్య‌లు చేస్తున్నార‌ని బాబుమోహ‌న్ వ్యాఖ్య‌నించారు. లా ఆండ్ ఆర్డ‌ర్ ఎంత విఫ‌లం అయిందో ఇదే నిద‌ర్శ‌నం అన్నారు. కొండ‌గ‌ట్టుకు వెళ్లలేద‌న్నారు. ఫాంహౌజ్‌ కు జానెడు దూరంలోనే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని పేర్కొన్నారు. ``కొండ‌గ‌ట్టు అంటే నాకు భ‌క్తి. ఆ భ‌క్తి ఈ భ‌క్తి అంటావు. ప్ర‌జ‌ల‌కు జ‌వాబు చెప్పాలి. ప్ర‌జ‌ల‌కు - ఎమ్మెల్యేల‌కు ఎందుకు క‌ల‌వ‌లేక‌పోతున్నావు. ప్ర‌గ‌తిభ‌వ‌న్ గేటు ద‌గ్గ‌ర సాయంత్రం వ‌ర‌కు ఎదురుచూసి...సాయంత్రం అయితే అస‌లే క‌ల‌వ‌డు అంటూ ఎమ్మెల్యేలు ఎంద‌రో వెళ్లిపోయిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి``అని బాబుమోహ‌న్ దుమ్మెత్తిపోశారు.

అయితే, బాబు మోహ‌న్ వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు నెటిజ‌న్లు ఘాటుగానే స్పందించారు. ``బాబు మోహన్ గారు ,, మీరు TRS పార్టీలో ఉన్నప్పుడు తెలిదా సర్ మీకు ఈ విషయాలు - మీకు MlA టికెట్ ఇచ్చి ఉంటే సప్పుడు చేయకుండా ఉండేటోనివి - KCR మా బావ అనుకుంటూ....ఈ దేశం ఎటు పోతుందో - నీచ రాజకీయాల వల్ల`` అంటూ ఓ నెటిజ‌న్ నిర్వేదం వ్య‌క్తం చేశారు. ``కొండగట్టు ప్రమాదం జరిగినప్పుడు నువ్వు trs లొనే ఉన్నావు క‌దా? అప్పుడెందుకు మాట్లాడ‌లేదు?`` అంటూ ఇంకో నెటిజ‌న్‌ ప్ర‌శ్నించారు.