Begin typing your search above and press return to search.

రాధా విష‌యంలో బాబు రియాక్ష‌న్‌.. ఎందుకింత ఆల‌స్యం..?

By:  Tupaki Desk   |   30 Dec 2021 6:31 AM GMT
రాధా విష‌యంలో బాబు రియాక్ష‌న్‌.. ఎందుకింత ఆల‌స్యం..?
X
బెజ‌వాడ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకున్న వంగ‌వీటి రంగాకు ఇక్క‌డి ప్ర‌జ‌ల గుండెల్లో ప్ర‌త్యేక స్థానం ఉంది. అయితే.. ఆయ‌న హ‌త్య అనంత‌రం సుదీర్ఘ కాలం త‌ర్వాత‌.. ఆయ‌న కుమారుడు రాధా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. కాంగ్రెస్ త‌ర‌ఫున 2004లో విజ‌యం సాధించారు. అయితే.. త‌ర్వాత నుంచి పార్టీలు మారుతూ.. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు. అయితే.. ఇటీవ‌ల రంగా వ‌ర్ధంతి సంద‌ర్భంగా.. ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతోంద‌ని.. త‌నను హ‌త‌మార్చేందుకు ఇప్ప‌టికే.. రెక్కీ కూడా నిర్వ‌హించార‌ని.. రాధా ప్ర‌క‌టించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.

ప్ర‌తి ఒక్క‌రూ విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ఇక‌, ఈ విష‌యంపై జ‌గ‌న్ స‌ర్కారు ఆఘ‌మేఘాల‌పై స్పందించింది. రెక్కీ ఎవ‌రు చేశారు? ఎందుకు చేశారు? దీని వెనుక ఎవ‌రు ఉన్నారు? అనే విష‌యాల‌పై ఆరా తీసేందుకు వెంట‌నే ఇంటిలిజెన్స్ వ‌ర్గాల‌ను రంగంలోకి కూడా దింపేసింది. అదేస‌మ‌యంలో రాధా భ‌ద్ర‌త‌కు.. 2+2 భ‌ద్ర‌త‌ను కూడా క‌ట్టుదిట్టం చేసింది. గ‌న్‌మ‌న్ల‌ను రాధా వ‌ద్ద‌కు కూడా పంపేసింది. అయితే, ఆయ‌న ప్ర‌భుత్వం ఇచ్చిన భ‌ద్ర‌త‌ను వ‌ద్ద‌న్నారు అది వేరే సంగ‌తి. కానీ, స‌ర్కారు మాత్రం వెంట‌నే స్పందించ‌డం ఇక్క‌డ విశేషం.ఇక్క‌డ మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర ఘ‌ట‌న చెప్పుకోవాలి. 2019లో జ‌గ‌న్ ను వ‌దిలేసి.. టీడీపీలో చేరిన రాధా. వైసీపీ ఓట‌మికి కృషి చేశారు.

అయిన‌ప్ప‌టికీ.. సీఎం జ‌గ‌న్ పాత వివాదాలు.. వ్యాఖ్య‌ల‌ను మ‌న‌సులో పెట్టుకోకుండా.. రాధాకు భ‌ద్ర‌త క‌ల్పించేందుకు రెడీ అయ్యారు. అయితే.. ఇంత జ‌రిగినా.. ప్ర‌స్తుతం రాధా ఉన్న పార్టీ నాయ‌కుడు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మాత్రం ఈ విష‌యంలో చాలా ఆల‌స్యంగా స్పందించారు. రాధా ఈ నెల 26న వ్యాఖ్య‌లు చేస్తే.. ప్ర‌భుత్వం వెంట‌నే 28న స్పందించింది. కానీ, పార్టీ నాయ‌కుడు. కీలక సామాజిక వ‌ర్గానికి ఓటు బ్యాంకు గా ఉన్న యువ నేత‌.. త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని ప్ర‌క‌టిస్తే.. స‌ద‌రు పార్టీ అధినేత‌గా చంద్ర‌బాబు హుటాహుటిన స్పందించాల్సి ఉంది. కానీ, ఆయ‌న మీన‌మేషాలు లెక్కించుకుని.. అంతా అయిన త‌ర్వాత‌.. రాధాకు ఫోన్ చేసి.. డీజీపీకి లేఖ రాశారు.

దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు చంద్ర‌బాబు ఇలా వ్య‌వ‌హ‌రించారు..? అనే ప్ర‌శ్న‌లు జోరుగా సాగుతున్నా యి. దీనికి ప్ర‌ధానంగా.. రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో క‌మ్మ నేత‌లపై.. ప్ర‌భుత్వం నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబు తెలిసో తెలియ‌కో ఆల‌స్యంగా స్పందించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు కాపు నాయ‌కుడిగా ఉన్న‌రాధా విష‌యంలో వెంట‌నే రియాక్ట్ అయితే.. క‌మ్మ‌ల‌కు ఎక్క‌డ కోపం వ‌స్తుందో అని ఆయన భావించి ఉంటార‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో పార్టీలోనే రాధా ఉన్నా.. ఇటీవ‌ల కాలంలో.. ఆయ‌న యాక్టివ్‌గా క‌నిపించ‌డం లేదు. ప‌నిచేయ‌నివారిని ప‌క్క‌న పెడ‌తాన‌ని ఇటీవ‌ల కాలంలో చంద్ర‌బాబు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న రియాక్ష‌న్ లేటై ఉంటుంద‌ని చెబుతున్నారు. ఏదేమైనా..చంద్ర‌బాబు రియాక్ష‌న్ లేట్ కావ‌డంతో అనుకున్న విధంగా మైలేజీ రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.