Begin typing your search above and press return to search.

బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌!

By:  Tupaki Desk   |   4 April 2019 7:13 AM GMT
బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌!
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాజ‌కీయంగా త‌నకు ప్ర‌త్య‌ర్థులైన ముగ్గురు ప్ర‌ముఖుల మీద ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఉలిక్కిప‌డేలా చేస్తున్నాయి. ఏపీలో రేపు కానీ ఎల్లుండి కానీ పెద్ద కుట్ర జ‌రుగుతుంద‌న్న చంద్ర‌బాబు.. ఆ కుట్ర వెనుక ప్ర‌ధాని మోడీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

ఏపీలో పెద్ద ఎత్తున శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య సృష్టించాల‌న్న‌ది ఆ ముగ్గురు ఆలోచ‌న‌గా ఆయ‌న ఆరోపించారు. దీనికి సాక్ష్యం ఏమైనా ఉందా? అన్న ప్ర‌శ్న‌ను ఎవ‌రూ అడ‌గ‌కుండానే ఆయ‌న చెప్పిన మాట ఆశ్చ‌ర్యానికి గురి చేసేలా ఉంది. ఏపీలో చేప‌ట్టాల్సిన కుట్ర కోసం ఒక రోజు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిలిపివేసి మ‌రీ లోట‌స్ పాండ్ లో మంత‌నాలు సాగించిన‌ట్లుగా ఆయ‌న ఆరోపించారు.

ఏపీ ప్ర‌జ‌ల‌కు ల‌క్ష కోట్ల రూపాయిల్ని ఎగ్గొట్ట‌టానికి జ‌గ‌న్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చార‌న్న ఆయ‌న‌.. జ‌గ‌న్ ఇచ్చే పాపిష్టి డ‌బ్బుల్ని పంచ‌టానికి కిలోమీట‌ర్ల కొద్ది ప్ర‌యాణించి ఏపీకి వ‌స్తున్నార‌న్నారు. డ‌బ్బు ఇవ్వ‌టానికి వ‌చ్చిన వారిని క‌ట్టిపారేయాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

ఓట్లు అడిగేందుకు జ‌గ‌న్ వ‌స్తే ఓట్లు వేయ‌మ‌ని ఆయ‌న‌కు తేల్చి చెప్పాల‌ని చెప్పిన చంద్ర‌బాబు.. ఎన్నికల వేళ టీడీపీ అభ్య‌ర్థుల్ని ల‌క్ష్యంగా చేసుకొని ఆదాయ‌ప‌న్ను అధికారుల చేత దాడులు చేయిస్తున్న‌ట్లుగా మండిప‌డ్డారు. ఇప్ప‌టికే ఉగ్ర న‌ర‌సింహారెడ్డి.. పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ పైనా దాడులు జ‌రిగాయ‌ని.. రానున్న రోజుల్లో మ‌రికొంద‌రిని బెదిరించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతాయ‌న్నారు.

త‌న‌పైనా దాడి చేయ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. త‌న మీద దాడి జ‌రిగితే అది త‌న మీద దాడి కాద‌ని.. ఏపీ రాష్ట్రం మీద దాడిగా బాబు అభివ‌ర్ణించారు. దాడులు చేస్తామంటూ బెదిరిపోయేది లేద‌న్న ఆయ‌న‌.. వీరి కుట్ర‌ల‌కు ప్ర‌జ‌లు ఓటుతో స‌మాధానం ఇవ్వాల‌న్నారు. ఓటు వేయ‌టం ద్వారా ఏపీ ప్ర‌జ‌లు త‌మ పౌరుషాన్ని చాటాల‌న్న చంద్ర‌బాబు.. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో మ‌ద్ద‌తు ఇస్తాన‌ని కేసీఆర్ జ‌గ‌న్ చెవిలో చెప్పారా? అని ప్ర‌శ్నించారు.
ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని సోనియా గాంధీ చెప్పిన రోజునే.. కేసీఆర్ సైతం త‌మ‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేసిన విష‌యాన్ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. నిజంగానే ఏపీకి కేసీఆర్ ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తు ఇస్తుంటే.. ఆయ‌న నేతృత్వంలోని ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ హోదీ మీద తీర్మానం చేయాల‌న్నారు. మ‌రి.. దీనిపై ముగ్గురు ప్ర‌ముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి.