Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రాలో బాబు మూడు రోజుల మకాం.....వైసీపీ ఊరుకుంటుందా...?

By:  Tupaki Desk   |   13 Dec 2022 2:30 PM GMT
ఉత్తరాంధ్రాలో బాబు మూడు రోజుల మకాం.....వైసీపీ ఊరుకుంటుందా...?
X
చంద్రబాబు ఇపుడు మంచి ఉత్సాహం మీద ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా జనాలు బ్రహ్మాండంగా వస్తున్నారు. నేల ఈనిందా అన్న అన్న గారి మాటలు నిజమయ్యే తీరున బాబుకు నీరాజనాలు పడుతున్నారు. చంద్రబాబు కూడా తన స్టైల్ మార్చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా పంచ్ డైలాగులు పేలుస్తున్నారు. లోకల్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ జనాల ముందు వారి వైఫల్యాలు బయటపెడుతున్నారు.

ఇక జగన్ని అయితే అసలు వదలడంలేదు. ఆయన పాలనలోని తప్పులను తీసుకుని మరీ ఒక లెక్కన మాటలతో చెడుగుడు ఆడుతున్నారు. బాబు వ్యూహాత్మకంగా ఏపీలో టూర్లు చేస్తూ వస్తున్నారు. మొదట రాయలసీమ హార్ట్ అయిన కర్నూల్ జిల్లాలో మూడు రోజుల టూర్ చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ మీదట గోదావరి జిల్లాల టూర్ పెట్టుకున్నారు అది కూడా సక్సెస్ అయింది. ఇక కోస్తాకు కీలకమైన స్థావరం అయిన గుంటూర్ లో మూడు రోజుల పాటు బాబు పర్యటిస్తే అది సూపర్ హిట్ అయింది.

దాంతో తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి ఉత్తరాంధ్రా వైపు బాబు చూస్తున్నారు. ఆయన చాలా కాలానికి ఈ ప్రాంతం వస్తున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు బాబు ఉత్తరాంధ్రాలో పర్యటిస్తారు. ఆయన విజయనగరం జిల్లాలోని గజపతినగరం, బొబ్బిలి, రాజాంలలో విస్తృతంగా పర్యటిస్తారు.

ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అన్న కార్యక్రమం లో భాగంగా బాబు ఈ టూర్ పెట్టుకున్నారు. ఈ పర్యటనలో రెండు రోజుల పాటు బాబు బొబ్బిలి రాజాం లలో రాతి పూట బస చేస్తారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ పరిస్థితి మీద పూర్తి స్థాయిలో వాకబు చేసి సమీక్షలు నిర్వహిస్తారు అని అంటున్నారు.

విజయనగరం జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ మొత్తానికి మొత్తం సీట్లను సాధించి క్లీన్ స్వీప్ చేసి పారేసింది. ఇక మూడున్నరేళ్ళుగా చూస్తే టీడీపీలో బలమైన నాయకులు ఉన్నా కూడా వర్గ పోరు అధికంగా ఉంది. దాంతో పాటు సీనియర్లు వర్సెస్ జూనియర్లుగా కధ సాగుతోంది.

బాబు తాజా టూర్ ద్వారా వీటన్నింటికీ చెక్ పెడతారు అని అంటునారు. అదే సమయంలో అత్యంత వెనకబడిన విజయనగరం జిల్లా ప్రగతి విషయంలో తెలుగుదేశం ఏమి చేస్తుంది అన్నది ఆయన తన టూర్ లో చెబుతారు అని అంటున్నారు. విజయనగరం లో ఈసారి మెజారిటీ సీట్లు గెలవాల్సిందే అని బాబు టార్గెట్ పెట్టారు. అదే విధంగా గెలుపు గుర్రాలనే ఆయన ఎంపిక చేస్తామని చెప్పారు. సీనియర్లు అవసరం అయితే తప్పుకోవాలని సూచిస్తున్నారు.

దీంతో ఈసారి బాబు టూర్ లో తెలుగుదేశం రాజకీయం బాగా మారుతుంది అని అంటున్నారు. ఆయన చెప్పాల్సిన పాఠాలు కూడా పార్టీ నాయకులకు చెబుతారు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఉత్తరాంధ్రా టూర్ బాబు చాలాకాలానికి చేస్తున్నారు. పైగా ఈ మధ్యన విశాఖ రాజధాని అని వైసీపీ గట్టిగా చెబుతూ వస్తోంది. అక్టోబర్ 14న విశాఖ గర్జన కూడా నిర్వహించింది. వచ్చే ఏడాది జూన్ నుంచే విశాఖలో జగన్ పాలన మొదలుపెడ్తారు అని అంటున్నారు.

ఈ పరిస్థితుల నేపధ్యం నుంచి చూసినపుడు రాక రాక వస్తున్న చంద్రబాబు విశాఖ రాజధాని మీద ఏ రకమైన కామెంట్స్ చేస్తారు అన్నది కూడా చర్చగా ఉంది. ఆయన ఉత్తరాంధ్ర గడ్డ మీద నుంచి విశాఖ వాసులకు ఏపీ జనాలకు టీడీపీ విధానం మీద ఏ రకమైన సందేశం ఇస్తారు అన్నది చూడాలి. అదే సమయంలో జేఏసీల పేరిట కర్నూల్ లో బాబు టూర్ ని అడ్డుకుని న్యాయ రాజధాని డిమాండ్లు వినిపించిన వైసీపీ నేతలు బాబు విశాఖ టూర్ లో ఏ రకమైన నినాదాలు చేస్తారు. ఆయన టూర్ ని సాగనీయకుండా అడ్డుకుంటారా అన్న చర్చ కూడా ఉంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.