అమరావతిలో బాధ్యతలు చేపట్టనున్న జేడీ
By: Tupaki Desk | 26 April 2016 1:41 PM GMTలక్ష్మీనారాయణ. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల ఆరోపణలపై మెరుపు విచారణ చేసిన పోలీస్ ఉన్నతాధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విధులు నిర్వర్తించిన ఈ డైనమిక్ ఆఫీసర్ త్వరలో నవ్యాంధ్రప్రదేశ్ లో పోలీస్ బాస్ గా రానున్నారని తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు ఒకటే పెండింగ్ లో ఉన్నాయని సమాచారం.
వైఎస్ జగన్ అక్రమాస్తుల విషయంలో తనదైన శైలిలో దర్యాప్తు నిర్వహించి దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న లక్ష్మీనారాయణ తన సర్వీసులో భాగంగా 2014లో మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. అడిషినల్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ సర్వీసు 2019వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ను 3 ఏళ్ల డిప్యుటేషన్ పై ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు రప్పించుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని సమాచారం. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కమిషనర్ గా మాజీ జేడీని రప్పించేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారని, అధికారిక ఉత్తర్వులే ఆలస్యం అని తెలుస్తోంది.
జగన్ అక్రమస్తుల కేసు విషయంలో జేడీ లక్ష్మీనారాయణ చురుకుగా వ్యవహరించి వైఎస్ జగన్ తో పాటు ఆయన సంస్థల్లో బినామీల రూపంలో పెట్టుబడులు పెట్టిన వారిని జైలుకు పంపడంలో కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో వివిధ వర్గాల నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ ధైర్యంగా - నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చారు. దీంతో పలు సంస్థలు ఆయనకు అవార్డులు కూడా ఇచ్చాయి. అనేక విద్యాలయాలు ఆయనను ముఖ్య అతిథిగా పిలిచి తమ విద్యార్థులకు గెస్ట్ లెక్చర్లు ఇప్పించాయి.