Begin typing your search above and press return to search.

గవర్నర్ తో బాబు భేటీ.. ఎంతసేపు మాట్లాడారు? ఏం మాట్లాడారు?

By:  Tupaki Desk   |   19 Jun 2020 3:30 AM GMT
గవర్నర్ తో బాబు భేటీ.. ఎంతసేపు మాట్లాడారు? ఏం మాట్లాడారు?
X
జగన్ సర్కారు మీద ఫిర్యాదులు చేసేందుకు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు విపక్ష నేత చంద్రబాబు. గురువారం రాత్రి రాజ్ భవన్ కు వెళ్లిన చంద్రబాబు.. గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య గంట పదినిమిషాల పాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా పద్నాలుగు పేజీలతో కూడిన లేఖను గవర్నర్ కు ఇచ్చిన చంద్రబాబు.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. పరిణామాల గురించి వివరించినట్లు చెబుతున్నారు.

తమ పార్టీకి చెందిన నేతల్ని అక్రమ కేసులతో ఇబ్బందికి గురి చేస్తున్నారన్నారు. తమ పార్టీకి చెందిన 33 మంది ప్రజాప్రతినిధులపై పెట్టిన కేసుల వివరాల నివేదికను అందజేశారు. మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లును మరోసారి దురాలోచనతో రెండోసారి ప్రవేశ పెట్టారని.. సదరు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపినట్లు ఏజీయే హైకోర్టుకు చెప్పారని.. అలాంటప్పుడు మరోసారి ఎలా సభలోకి ప్రవేశ పెడతారని చెప్పినట్లు చెబుతున్నారు.

తాము చెప్పినట్లు చేయని వారికి పోస్టింగ్ లు ఇవ్వకుండా సగం జీతమే ఇస్తామని చెబుతున్న వైనాన్ని గవర్నర్ కు వివరించారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. తానేం విషయాల్ని మాట్లాడింది చెప్పుకొచ్చారు. న్యాయవ్యవస్థ పైనా విమర్శలు చేస్తున్నారని.. మీడియా.. సోషల్ మీడియా.. ప్రజల గొంతును నొక్కుతున్నట్లు ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా ఉన్న నాలుగు వ్యవస్థల్నీ భ్రష్టు పట్టించిన నేపథ్యంలో తక్షణమే గవర్నర్ కలుగజేసుకోవాలని తాను కోరినట్లు చెప్పారు.

మాట్లాడితే తమకు 151 సీట్లు వచ్చాయని చెబుతున్నారని.. ప్రధాని మోడీకి కూడా మెజార్టీ వచ్చిందని.. కానీ ఆయన మాట్లాడే తీరులో జగన్ మాదిరి లేదన్నారు. ఆయన అందరితో మాట్లాడే చేస్తున్నారని చెప్పారు. జగన్ ఏడాది పాలనతో రాజ్యాంగ ఉల్లంఘనలు.. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన.. చట్ట ఉల్లంఘనలతో పాటు బెదిరింపులు కూడా భారీగా సాగినట్లు విమర్శించారు.