Begin typing your search above and press return to search.

వ్యూహకర్తను మార్చేసిన బాబు.. లాభమా? నష్టమా?

By:  Tupaki Desk   |   15 Feb 2022 7:29 AM GMT
వ్యూహకర్తను మార్చేసిన బాబు.. లాభమా? నష్టమా?
X
తన పొలిటికల్ కెరీర్ లో ఎప్పుడూ ఎదుర్కోనంత ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఒకవైపు వయోభారం.. మరోవైపు ఏపీలో మారిన రాజకీయం ఆయన్ను తెగ ఇబ్బంది పెడుతోంది. ఆయన ఎవరి మీదనైతే ఆధారపడతారో.. వారే సమయానికి హ్యాండ్ ఇచ్చేసే పరిస్థితి. సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉన్న వేళ.. వచ్చే ఎన్నికలు ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పక తప్పదు.

డెబ్భై ప్లస్ లోఆయన పడుతున్న కష్టం.. చేస్తున్న శ్రమ.. ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని చూసినప్పుడు.. చంద్రబాబు కాబట్టి తట్టుకుంటున్నాడు కానీ.. మరొకరు అయితేనా? అన్న భావన కలుగక మానదు.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో విజయం ఎంతో కీలకంగా మారిన నేపథ్యంలో ఇంతకాలం పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న రాబిన్ శర్మ స్థానంలో ప్రశాంత్ కిషోర్ టీంలోని సునీల్ ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికలకు సరిపోయేలా ఆయన పలు నియోజకవర్గాల్ని యువ రక్తంతో నింపాలన్న యోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆర్థిక.. సామాజిక అంశాల్ని పరిగణలోకి తీసుకొని ఫ్యూచర్ నాయకుల్ని కొందరిని తయారు చేయాలన్న పట్టుదలతో ఉన్నచంద్రబాబు.. అందుకు తగ్గట్లే స్క్రీనింగ్ చేస్తున్నారు.

కొత్త నీరు వచ్చే వేళ.. పాత నీరు పక్కకు తప్పుకోక తప్పదన్నట్లుగా.. కొత్తగా వచ్చే వారి కోసం సీనియర్లు కొందరు త్యాగాలు చేయాలన్న సంకేతాల్ని చంద్రబాబు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇదే సమయంలో తన వ్యూహకర్తను కూడా మార్చుకోవాలని డిసైడ్ అయిన ఆయన.. పీకే టీంలో కీలక భూమిక పోషించే సునీల్ తో ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు రాబిన్ శర్మతో అసోసియేట్ అయిన బాబు.. వారి టీం చేస్తున్న సర్వే రిపోర్టుల మీద నమ్మకం పెట్టుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు.

అయితే.. ఇక్కడే ఒక తిరకాసు ఉందంటున్నారు. ప్రస్తుతం తన వ్యూహకర్తగా పెట్టుకున్న సునీల్.. పీకే కోర్ టీంకు చెందిన వాడు కావటం.. మరోవైపు పీకే టీం వచ్చే ఎన్నికల్లోజగన్ కు పని చేస్తున్న వేళ.. తాజా ఎంపిక సరైనదేనా? అన్నది సందేహంగా మారింది. పీకేం టీం ఒకవైపు జగన్ కు చేస్తూ.. అందులోని ముఖ్యమైన మరో వ్యక్తిని తాను వ్యూహకర్తగా నియమించుకోవటం ఎంతవరకు కరెక్టు? అన్న దానిపై పార్టీలోని కీలక నేతల మధ్య చర్చ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.

ఈ మాత్రం చంద్రబాబు ఆలోచించకుండా ఉండి ఉంటారా? అన్న ప్రశ్నతో పాటు.. సునీల్ సేవల విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఏమైనా.. వ్యూహకర్తను మార్చి అంశం పార్టీలోని ముఖ్యనేతల మధ్య ఆసక్తికర చర్చకు తెర తీసిందని చెప్పక తప్పదు.