Begin typing your search above and press return to search.

కుక్క‌ల్లా కాల్చాల‌న్న బీజేపీ నేత‌...సంబంధం లేద‌న్న కేంద్ర‌మంత్రి

By:  Tupaki Desk   |   13 Jan 2020 5:30 PM GMT
కుక్క‌ల్లా కాల్చాల‌న్న బీజేపీ నేత‌...సంబంధం లేద‌న్న కేంద్ర‌మంత్రి
X
పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం ప‌శ్చిమ‌బెంగాల్‌ను అట్టుడికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చ‌ట్టాన్ని వ్య‌తిరేకిస్తూ ఏకంగా ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ గ‌లం విప్ప‌డం, ఆందోళ‌న‌లు చేయ‌డంతో గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో బెంగాల్‌లో భారీ హింస చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ఆందోళ‌న‌కారులు ఆ రాష్ట్రంలో కోట్ల విలువైన‌ రైల్వే ఆస్తుల‌ను ధ్వంసం చేశారు. పశ్చిమబెంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనల వల్ల రూ.84 కోట్ల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయని రైల్వే శాఖ తెలిపింది. అయితే, ఆ హింసను ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ దిలీప్ ఘోష్ ఖండించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అయితే, దాన్ని కేంద్ర‌మంత్రి ఖండించారు.

సీఏఏ ఆందోళ‌న‌లు, ఆస్తి న‌ష్టంపై బెంగాల్ బీజేపీ చీఫ్‌ దిలీప్ ఘోష్ స్పందిస్తూ  ఆందోళ‌న‌కారుల‌ను అడ్డుకోవ‌డంలో దీదీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్నారు. నిర‌స‌న‌కారుల‌పై ఫైరింగ్ కానీ, లాఠీచార్జ్‌కు కానీ మ‌మ‌త ఆదేశాలు జారీ చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. ``ఇదేమైనా వాళ్ల‌ తండ్రి ఆస్తా? ప్రభుత్వ ఆస్తుల‌ను ఎలా త‌గుల‌బెడుతారు, ప‌న్ను క‌ట్టిన వారి ఆదాయం తో ఏర్పాటు చేసిన ఆస్తుల‌ను ఎందుకు ధ్వంసం చేస్తున్నారు?`అని దిలీప్ ఘోష్ ప్ర‌శ్నించారు. సీఏఏకు వ్య‌తిరేకంగా నిర‌స‌న చేప‌డుతున్న వారిపై క‌ర్నాట‌క‌, అస్సాం, యూపీ ప్ర‌భుత్వాలు ఫైరింగ్‌ కు ఆదేశించి మంచి ప‌నిచేశాయ‌న్నారు. ప్ర‌జా ఆస్తుల‌ను ధ్వంసం చేసే వారిని యూపీ త‌ర‌హాలో కాల్చి చంపాల‌ని  వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ‘ఇక్కడికొచ్చి.. మన తిండి తింటూ.. మన దగ్గర బతుకుతూ.. మన చట్టాలకు వ్యతిరేకించడం.. మన ఆస్తుల్ని ధ్వంసం చేయడానికి వీళ్లకెంత ధైర్యం? వీళ్లేమైనా జమీందార్లా? కుక్కల్లాగా కాల్చిపారేయాలి‘‘ అని విరుచుకుప‌డ్డారు.

అయితే, బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్య‌లు దుమారం రేపిన నేప‌థ్యంలో...ఆయ‌న కామెంట్ల‌ను ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో త‌ప్పుప‌ట్టారు. 'ఘోష్ వ్యాఖ్యలతో పార్టీ కి ఎలాంటి సంబంధం లేదు. యూపీ, అసోంలో బీజేపీ ప్రభుత్వాలు ప్రజలపై ఏ కారణం చేతనైనా కాల్పులు జరపలేదు. ఏమాత్రం బాధ్యత లేకుండా దిలీప్ వ్యాఖ్యలు ఉన్నాయి' అని బాబుల్ సుప్రియో వ్యాఖ్యానించారు. దిలీప్ చాలా బాధ్య‌తార‌హితంగా మాట్లాడిన‌ట్లు ఆయ‌న అన్నారు.