Begin typing your search above and press return to search.

మొన్న ఎలుకలు.. ఇప్పుడు పందికొక్కులు

By:  Tupaki Desk   |   17 Sept 2015 11:11 AM IST


మరో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలీక.. పెద్దలు చేసిన దానికి భూమి మీదకు వచ్చి పడే పసికందుల విషయంలో తల్లిదండ్రులే కాదు.. చుట్టూ ఉన్న సమాజం స్పందిస్తున్న తీరు చూసినప్పుడు గుండె తరుక్కుపోక మానదు. మొన్నామధ్య ఏపీలోని గుంటూరు పెద్దాసుపత్రిలో అప్పుడే పుట్టిన పసికందును ఎలుకలు తినటం కారణంగా చనిపోవటం తెలిసిందే.

ఆసుపత్రిలో వార్డులోకి.. అందునా చిన్నారులకు ట్రీట్ మెంట్ ఇస్తున్న గదిలోకి ఎలుకలు తిరగటమే కాదు.. పసికందును కొరికేయటం అంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. ఈ దారుణ ఘటనను మరిచిపోక ముందే మరో దారుణ ఘటన బయటకొచ్చింది. ఏ తల్లి కన్న బిడ్డో కానీ.. నవమోసాలు మోసిన కడుపు తీపిని కూడా వదిలేసి పుట్టగానే విశాఖలోని ఒక మురికి కాలువలో కనిపించాడు.

అన్నెంపున్నెం ఎరుగని ఆ చిన్నారి పట్ల.. పుట్టించిన పేగు నిర్దయగా వ్యవహరించటమేకాదు.. ఈ కుంతీపుత్రుడికి మరో కష్టం వచ్చి పడింది. భూమి మీద పడి గంటలు కూడా గడవక ముందే తల్లి నిర్దయతో మురికికాలువలో కనిపించిన అతగాడిని పందికొక్కులు కొరుకుతున్నాయి. అంతలో పిల్లాడి ఏడుపుతో చుట్టుపక్కల వారు గుర్తించి.. బయటకు తీశారు. అప్పటికే ఆ చిన్నారి శిశువు ఎడమకాలు బొటన వేలును పందికొక్కులు పూర్తిగా కొరికేశాయి. చేతులు.. ఇతర భాగాలపైనా గాయాలయ్యాయి.

వెంటనే స్పందించిన చుట్టుపక్కల వారు శిశువును కేజీహెచ్ కు తరలించారు. మురికి గుంట నుంచి బయటకు తీసిన ఈ శిశువును నీటితో శుభ్రం చేసి ఆసుపత్రికి తరలించారు. పందికొక్కుల దాడి జరిగినా.. శిశువుకు ప్రాణాపాయం లేదని.. ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు చెబుతున్నారు. పుట్టిన గంటల్లోనే ఎంత కష్టమో కదూ.