Begin typing your search above and press return to search.

మ‌ధ్య‌వేలికి సిరా...తెలంగాణ ఎన్నిక‌ల్లో ఇది వైర‌ల్‌

By:  Tupaki Desk   |   10 May 2019 2:38 PM GMT
మ‌ధ్య‌వేలికి సిరా...తెలంగాణ ఎన్నిక‌ల్లో ఇది వైర‌ల్‌
X
విష‌యం ఏదైనా కావ‌చ్చు...ఒక్కోసారి స్పంద‌న అతి అయితే కూడా అస్స‌లు బాగోదు. కానీ, స‌హ‌జంగా ఉండే భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌కు సోష‌ల్ మీడియా తోడు కావ‌డంతో ఇక ఎవ‌రి భావాలు వారు పెద్ద ఎత్తున్నే వ్య‌క్తీక‌రిస్తున్నారు. సంద‌ర్భాన్ని త‌మదైన శైలిలో చిత్రీక‌రిస్తున్నారు. తాజాగా, తెలంగాణ పరిషత్ ఎన్నికల పోలింగ్ స‌మ‌యంలో మ‌ధ్య వేలికి ఇంకు పెట్ట‌డం అనేది సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారుతోంది. ఈ విధంగా ఇంకు పెట్ట‌డాన్ని కొంద‌రు కామెంట్ చేస్తే...అలా కామెంట్ చేయ‌డాన్ని మ‌రికొంద‌రు త‌ప్పుప‌డుతున్నారు.

వివ‌రాల్లోకి వెళితే...తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న ముంద‌స్తు ఎన్నిక‌ల నిర్ణ‌యం ఫ‌లితంగా జ‌రిగిన పోలింగ్ నుంచి మొద‌లుకొని...ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో ఎన్నిక‌ల సంద‌డి కొన‌సాగుతోంది. అసెంబ్లీ త‌ర్వాత పంచాయ‌తీ - ఆ త‌ర్వాత పార్ల‌మెంటు - అనంత‌రం ప‌రిష‌త్ ఎన్నిక‌లు - త్వ‌ర‌లో పుర‌పాల‌క ఎన్నిక‌లు..ఇలా ఎన్నిక‌లే ఎన్నిక‌లు. అయితే, ఓటు వేసిన ఓట‌రును గుర్తించేందుకు గాను వేలికి సిరా అంటించే ప్ర‌క్రియలో తాజాగా జ‌రిగిన ఎన్నిక‌లో మ‌ధ్య వేలికి సిరా అంటించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో పెట్టిన సిరా ఇంకా చెరిగిపోని నేప‌థ్యంలో ఈ మేర‌కు ఈసీ నిర్ణ‌యం తీసుకుంది.

పోలింగ్ రోజున ఓటువేసిన అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు - ప్రజాప్రతినిధులు సైతం తాము ఓటు వేశామని మధ్య వేలిని చూపించారు. అయితే, దీనిపై పలువురు నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. మధ్య వేలిని చూపిస్తే వ్యక్తమయ్యే బూతు భావనను పేర్కొంటూ..వీరికి ఈ మాత్రం తెలియదా అంటూ పంచ్‌ల వర్షం కురిపించారు. ఇంకొందరు శృతిమించిన కామెంట్లు చేశారు. అయితే, నెటిజన్ల ఉత్సాహంపై పలువురు ఘాటుగా స్పందిస్తున్నారు. వెంటవెంటనే వచ్చిన ఎన్నికల వల్ల ఇలా గుర్తుకు పెట్టినంత మాత్రానా ఇలా స్పందించాలా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. వేలుకు రంగు పెట్టడంలో తప్పేముందని పేర్కొంటున్నారు. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్ ఈ రేంజ్‌లో ఉండాల్సిన అవ‌స‌రం ఉందా అంటూ మ‌రికొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంద‌రు...ఈసీకి మ‌రో వేలు దొర‌క‌న‌ట్లు మ‌ధ్య‌వేలికి ఇంకు అంటించ‌డం ద్వారా ఈ చిత్ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేపార‌ని వ్యాఖ్యానిస్తున్నారు.