Begin typing your search above and press return to search.

గెలుపును ఎంజాయ్ చేయనివ్వకుండా ఈ వరుస అపశకునాలేంది సారూ?

By:  Tupaki Desk   |   23 March 2021 7:30 AM GMT
గెలుపును ఎంజాయ్ చేయనివ్వకుండా ఈ వరుస అపశకునాలేంది సారూ?
X
దుబ్బాక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలతో ఉలిక్కిపడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. స్వయంగా రంగంలోకి దిగి నేరుగా రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్ని నడిపించారు. పెద్ద సారే సీన్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలవకుండా ఉంటామా? అన్న నమ్మకాన్ని గులాబీ దళానికి కలిగించారు కేసీఆర్. కష్టమనుకున్న రెండుచోట్ల గెలుపుతో బయటపడిపోవటం గులాబీ దళానికి కొత్త శక్తిని ఇచ్చింది. డబుల్ గెలుపుతో కేసీఆర్ ముఖం ఎంతలా వెలిగిపోయిందో అందరికి తెలిసిందే. తన నైజానికి భిన్నంగా కేసీఆర్ రియాక్టు కావటమే కాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత.. ప్రగతిభవన్ కు వచ్చిన నేతలందరితో ఖుషీ ఖుషీగా గడిపినట్లు చెబుతారు.

ఇదిలా ఉంటే.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు కొత్త కావు. వాటిల్లో విజయం కొత్తేం కాదు. విజయం సాధించిన ప్రతిసారీ.. తెలంగాణ భవన్ లో టపాసులు పేలుస్తుంటారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబుల్ విజయాన్ని సాధించిన వేళ.. కాల్చిన టపాసులతో టీఆర్ఎస్ భవన్ బయట ఏర్పాటు చేసిన పందిరికి నిప్పు అంటుకోవటం.. మంటలు రేగటంతో ఒక్కసారి షాక్ తిన్నారు. ఎన్నోసార్లు టపాసులు కాల్చినా ఏప్పుడు లేని రీతిలో ఫైర్ యాక్సిడెంట్ కావటాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు.

ఇది సరిపోదన్నట్లుగా.. ఎన్నికల్లో విజయాన్ని తక్కువ చేసేలా.. తీన్మార్ మల్లన్న ఓటమిపై ఒక అభిమాని ఆత్మహత్య చేసుకోవటం.. కోదండం మాష్టారు ఓటమిపై.. మరో అభిమాని ఆత్మాహత్యాయత్నం చేయటం సంచలనంగా మారింది. ఈ రెండు అధికార టీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారాయి. ఇది సరిపోదన్నట్లుగా.. సోమవారం రాత్రి సూర్యాపేటలో మంత్రి ఏర్పాటు చేసిన జాతీయ కబడ్డీ పోటీలను తిలకించేందుకు ఏర్పాటు చేసిన వేదిక.. కుప్పకూలిపోవటంతో 150 - 200 మంది వరకు గాయాలపాలైనట్లుగా చెబుతున్నారు.

నిజానికి సోమవారం మధ్యాహ్నమే.. భారీ పీఆర్సీని.. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పెంచుతూ నిర్ణయం తీసుకోవటంతో వచ్చిన స్పందనకు గులాబీ నేతలు మురిసిపోయారు. అధినేత రంగంలోకి దిగి వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్న కారణంగా మార్పు ఖాయంగా వస్తుందని.. కేసీఆర్ విషయంలో ప్రజల్లో వ్యతిరేకత తగ్గే అవకాశం ఉందన్న ఆశాభావం వ్యక్తమవుతున్న వేళలో అనూహ్యంగా సూర్యాపేట విషాదం చోటు చేసుకుంది. ఇదంతా చూస్తే.. ఏ ఆనందాన్ని.. మరే గెలుపును ఎంజాయ్ చేయలేని విధంగా ఏదో ఒక షాకింగ్ పరిణామం చోటు చేసుకుంటుందన్న భావన కలుగక మానదు. కేసీఆర్ ను విపరీతంగా అభిమానించే వారైతే.. సారు అర్జెంట్ గా ఏదైనా యాగం చేయించాలని కోరుతున్నారు. వరుస పెట్టి ప్రతి ఆనందాన్ని నీరుకార్చేలా జరుగుతున్న ఘటనలకు చెక్ పెట్టేలా ఏదైనా ఒక మాంచి యాగాన్ని చేపట్టాలన్న మాట వారి నోటి నుంచి వినిపిస్తుండటం గమనార్హం.