Begin typing your search above and press return to search.

వైసీపీలో బ్యాడ్ లక్ అంటే ఆ ముగ్గురు ఎమ్మెల్యేదేనట

By:  Tupaki Desk   |   20 April 2022 6:30 AM GMT
వైసీపీలో బ్యాడ్ లక్ అంటే ఆ ముగ్గురు ఎమ్మెల్యేదేనట
X
పదవుల పరుగు పందెంలో అందరి కంటే ముందు ఉండాలని తపించని రాజకీయ నేత ఎవరూ కనిపించదు. రాజకీయంలో అడుగు పెట్టటం వరకు ఎలా ఉన్నా.. ఒకసారి కాలు పెట్టాక అంచలంచెలుగా ఎదిగేందుకు ఎవరికి వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. నేతలు పదవుల్ని ఆశిస్తుంటారు.. భంగపడుతుంటారు. ఇవన్నీ మామూలే.కాకుంటే.. పెద్ద పదవుల్ని ఆశించి.. ఉన్న పదవుల్ని పోగొట్టుకోవటం చాలా తక్కువ సందర్భాల్లో చోటు చేసుకుంటుంది. అలాంటిది ఇప్పుడు వైసీపీలో కనిపిస్తోంది.

కొండ నాలుక్కి ముందు వేస్తే ఉన్న నాలుక పోయిందన్నట్లుగా.. పెద్ద పదవులకు టార్గెట్ పెట్టిన ముగ్గురు ఎమ్మెల్యేలకు.. ఇప్పటికే ఉన్న కీలక పదవులు మిస్ కావటం చర్చనీయాంశంగా మారింది. వారెవరంటే ఎమ్మెల్యేలు పార్థసారధి.. ఉదయభాను.. శిల్పా చక్రపాణి రెడ్డిలుగా చెప్పాలి.

తాజాగా ప్రాంతీయ సమన్వయకర్తల పదవుల ఎంపిక జరిగిన వేళ.. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు జగన్ ఇచ్చిన షాక్ మామూలుగా లేదంటున్నారు. ఎందుకంటే.. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరికి వారు పార్టీకి.. జగన్ కు అత్యంత విధేయులు. తమకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు. కానీ.. వారి ఆశల మీద నీళ్లు పోసిన జగన్ ఆ ముగ్గురికి మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదు.

మంత్రి పదవులు ఆశించినప్పటికి దక్కకపోవటం మామూలే. ఎందుకంటే.. మంత్రి పదవిని చేపట్టాలంటే సామాజిక సమీకరణాలు కుదరాలి. కాంబినేషన్లు సెట్ కావాలి. కూసింత లక్ కూడా ఉండాలి. అదృష్టం లేకుంటే లేకపోయింది. దురదృష్టం తగులుకోకూడదు.

ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు మాత్రం ఇప్పుడు ఇలాంటి పరిస్థితే. ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తూ ప్రాంతీయ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న ఈ ముగ్గురిని తాజాగా తొలగిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవులకు టార్గెట్ పెడితే.. ఉన్న పదవులు పోవటం వారికి షాకింగ్ గా మారింది.

అధినేత నిర్ణయంతో హతాశులయ్యారన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే మంత్రి పదవులు రాక ఫీల్ అవుతున్న వేళ.. ఉన్న పదవుల నుంచి తప్పించటాన్ని జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. టైం బ్యాడ్ అంటే దీన్నే అనాలేమో?