Begin typing your search above and press return to search.

బెజ‌వాడ మేయర్ అయితే ఇంత బ్యాడ్ సెంటిమెంటా ?

By:  Tupaki Desk   |   13 July 2021 8:59 AM GMT
బెజ‌వాడ మేయర్ అయితే ఇంత బ్యాడ్ సెంటిమెంటా ?
X
స‌మైక్య రాష్ట్రంలోనే పురాతన కార్పొరేష‌న్ల‌లో బెజ‌వాడ కూడా ఒక‌టి. 1921లో విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పడింది. 2005లో నగరపాలక సంస్థ సరికొత్తగా రూపాంతరం చెందింది. విజయవాడ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి అనేక మంది మేయర్లుగా పనిచేశారు. విచిత్రమేంటంటే ఇక్కడ నుంచి మేయర్ గా పని చేసిన వారు ఆ తర్వాత చట్టసభలకు మాత్రం వెళ్లలేదు. విజయవాడ నగర అభివృద్ధిలో తమదైన ముద్ర వేసిన అవినీతి రహిత పాలన అందించిన మేయ‌ర్లు కూడా ఎమ్మెల్యేలుగా మాత్రం విజయం సాధించలేదు. విచిత్రమేంటంటే ఎక్కడినుంచి కార్పొరేటర్లుగా పనిచేసిన వారు ఎమ్మెల్యేలు అయ్యారు. దీంతో విజయవాడ నగర రాజకీయాల్లో మేయర్ పదవి వారి రాజకీయ భవిష్యత్తు విషయంలో ఒక బ్యాడ్ సెంటిమెంట్ గా మారిపోయింది.

ముందుగా విజ‌య‌వాడ మేయ‌ర్లుగా జంధ్యాల‌ శంకర్, టి. వెంకటేశ్వరరావు వంటి ప్రముఖ నేతలు పనిచేశారు. వీరిద్ద‌రు న‌గ‌ర అభివృద్ధి విష‌యంలోనూ, అవినీతి ర‌హిత పాల‌న అందించ‌డంలోనూ త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. పైగా బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన వీరు ఆ వ‌ర్గం ఓట్లు ఎక్కువుగా ఉన్నా చ‌ట్ట స‌భ‌ల‌కు వెళ్ల‌లేదు. జంధ్యాల శంక‌ర్ ఇక్క‌డ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత మేయ‌ర్ అయిన టి. వెంక‌టేశ్వ‌ర‌రావుకు ఎంతో మంచి పేరు ఉంది. ఆయ‌న రెండు సార్లు మేయ‌ర్‌గా ప‌నిచేసినా ఎమ్మెల్యే కాలేక‌పోయారు.

ఆ త‌ర్వాత పంచుమ‌ర్తి అనూరాధ టీడీపీ నుంచి మేయ‌ర్‌గా ఎంపికై ఐదేళ్లు ప‌నిచేశారు. ఆమె ఇప్ప‌ట‌కీ టీడీపీలో కొన‌సాగుతుండ‌డంతో పాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ప‌ద‌వుల కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆమెకు అదిగో ఎమ్మెల్సీ, ఇదిగో ఎమ్మెల్యే సీటు అంటున్నారే త‌ప్పా ఆమెకు ఒక్క‌సారి పోటీ చేసే ఛాన్స్ రావ‌డం లేదు. పార్టీ అధికారంలో ఉన్న గ‌త ఐదేళ్లు ఊరించి ఊరించి ఆమెను ఉసూరుమ‌నిపించారు. ఇక గ‌త ఐదేళ్ల‌లో టీడీపీ మేయ‌ర్‌గా ఉన్న కోనేరు శ్రీథ‌ర్ అయితే 2019 ఎన్నిక‌ల్లో తూర్పు టీడీపీ టిక్కెట్ నాదే అన్నారు. ఆ త‌ర్వాత గ‌ప్‌చుప్ అయ్యారు. ఇక ఇప్పుడు రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి మేయ‌ర్‌గా ఉన్నారు. వైసీపీలో స‌మీక‌ర‌ణ‌లు చూస్తే ఆమెకు ఎలాగూ ఎమ్మెల్యే సీటు రాదు. ఈ ప‌రిణామాలు చూస్తే విజ‌య‌వాడ మేయ‌ర్ అయిన వాళ్ల‌కు ఆ త‌ర్వాత పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ క‌న‌ప‌డ‌ట్లేదు.