Begin typing your search above and press return to search.

పరిషత్ ఎన్నికల్లో జనసేన గెలిచిన చోట అంత దారుణ పరిస్థితి ఉందా?

By:  Tupaki Desk   |   22 Sep 2021 3:18 AM GMT
పరిషత్ ఎన్నికల్లో జనసేన గెలిచిన చోట అంత దారుణ పరిస్థితి ఉందా?
X
షాకింగ్ వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇటీవల వెల్లడైన పరిషత్ ఎన్నికల్లో.. 180 స్థానాల్ని గెలుచుకున్న తమ పార్టీ కార్యకర్తల్ని అధికార పార్టీకి చెందిన వారు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. వాస్తవానికి పరిషత్ ఎన్నికల్లో జనసేన కొన్ని స్థానాలైనా గెలుస్తుందన్న అంచనాలు లేవు. అందుకు భిన్నంగా.. ఆశ్చర్యానికి గురి చేసేలా రెండు జెడ్పీటీసీ స్థానాల్ని.. 180 ఎంపీటీసీ స్థానాల్ని గెలుచుకుంది. దీంతో.. ఆ పార్టీలో కొత్త ఉత్సాహాం పొంగిపొర్లుతోంది.

అయితే.. పరిషత్ ఎన్నికల్లో తాము విజయం సాధించిన చోట అధికార పార్టీ దారుణంగా వ్యవహరిస్తోందని.. స్థానిక పోలీసులతో కలిసి తమ కార్యకర్తలపై దాష్ఠీకాల్ని ప్రదర్శిస్తున్నారని జనసైనికులు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని తాజాగా పవన్ కల్యాణ్ సైతం ప్రస్తావిస్తూ.. షాకింగ్ అంశాల్ని బయటపెట్టారు. నిజంగానే..అలాంటి పరిస్థితి ఉందా? అన్న సందేహం కలిగేలా ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తున్నాయి.

విచిత్రమైన అంశం ఏమంటే.. పవన్ చెబుతున్నట్లుగా అంత దారుణమైన పరిస్థితే ఉంటే.. ప్రధాన మీడియాలోనో.. టీవీ చానళ్లలోనో.. ఇదేమీ కాదంటే.. కనీసం యూ ట్యూబ్ చానళ్లలో అయినా రావాలి కదా? అలాంటివి ఎందుకు కనిపించలేదన్న మాట వినిపిస్తోంది.

ఇంతకీ పవన్ చేస్తున్న ఆరోపణలు చూస్తే.. తమ పార్టీ గెలిచిన చోట.. తమ కార్యకర్తలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారని చెబుతున్నారు. ఆయన మాటల్లోనే చూస్తే.. ‘కడియం మండలంలోని పొట్టిలంకలో 1224 ఓట్ల మెజార్టీతో జనసేన అభ్యర్థి విజయం సాధిస్తే.. కనీసం గెలిచిన అభ్యర్థికి దండ వేసే పరిస్థితి లేదు. నిర్దాక్షణ్యంగా కామిరెడ్డి సతీశ్ అనే జనసైనికుడిని దారుణంగా కొట్టారని.. కాళ్లు పట్టుకొని ప్రాధేయపడినా వదిలి పెట్టకుండా దాడి చేసినట్లు ఆరోపించారు.

ఇదంతా పోలీసుల సాయంతోనే జరిగిందని మండిపడ్డారు. ఇదొక్కటే కాదని.. వీరవరం ఎంపీటీసీ స్థానాన్ని జనసేన గెలిచిందన్న అక్కసుతో కర్రలకు మేకులు కొట్టి అడ్డగోలుగా జనసేన కార్యకర్తలపై దాడి జరిగినట్లుగా ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఈ ఉదంతాన్ని పోలీసుల ద్రష్టికి తీసుకెళ్లి కేసు నమోదు చేయాలని కోరితే.. మొదట ససేమిరా అన్నారని.. స్టేషన్ బయట ధర్నా చేస్తానంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదు చేశారన్నారు. ఇలా పలుచోట్ల తమ మీద దాడి జరిగినట్లుగా జనసేన ఆరోపిస్తోంది. మరి ఇంతటి దారుణ పరిస్థితి ఉంటే.. ప్రధాన మీడియాలో ఇలాంటివి ఎందుకు కవర్ కాలేదన్నది ప్రశ్నగా మారింది.