Begin typing your search above and press return to search.

గాంధీ మార్చురీ నుండి దుర్వాసన వస్తుందట..!

By:  Tupaki Desk   |   25 May 2020 1:30 PM GMT
గాంధీ మార్చురీ నుండి దుర్వాసన వస్తుందట..!
X
గాంధీ హాస్పిటల్ ...దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హాస్పిటల్ గా భావించి , వైరస్ భారిన పడిన వారిని గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే , గాంధీ మార్చురీ నుండి వెలువడుతున్న తీవ్ర దుర్వాసనను తాము భరించలేకపోతున్నామని అభినవ నగర్‌ కాలనీవాసులు ఆందోళన చేస్తున్నారు. ఈ మేరకు కాలనీ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌.రాజేష్‌ గౌడ్‌ ఆదివారం పద్మారావునగర్ ‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

గత 10 రోజుల నుంచి గాంధీ ఆస్పత్రి మార్చురీ నుంచి వస్తున్న దుర్వాసన వల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, మార్చురీలోని ఏసీ పని చేయకపోవడంతో అక్కడ నిల్వ ఉంచిన మృత దేహాల నుంచి పక్కనే ఉన్న కాలనీలకు భరించలేని విధంగా దుర్వాసన వస్తుందని అన్నారు. ఈ విషయమై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఇతర అధికారులకు విన్నవించినా ఫలితంగా లేదన్నారు. దుర్వాసన వల్ల పద్మారావు నగర్‌ పరిసర ప్రాంతాల్లోని వందలాది కుటుంబాలు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నాయని తెలిపారు.

ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్ - కేటీఆర్ - తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. సమస్యను పరిష్కరించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పద్మారావునగర్‌ కాలనీవాసులతో కలిసి గాంధీ ఆస్పత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వెంటనే రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి దీనిపై జ్యోక్యం చేసుకొని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలనీ కోరారు.