Begin typing your search above and press return to search.

గెలిచినా...ఇక బీజేపీకి కష్టకాలమే!

By:  Tupaki Desk   |   19 Dec 2017 11:16 AM GMT
గెలిచినా...ఇక బీజేపీకి కష్టకాలమే!
X
ఔను బీజేపీకి ఇక క‌ష్ట‌కాల‌మేన‌ట‌. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తన ప్రతిష్ఠను కాపాడుకున్నప్ప‌టికీ....ఈ చ‌ర్చ తెర‌మీద‌కు రావ‌డం గ‌మ‌నార్హం. గుజరాత్‌ లో వరుసగా ఆరోసారి అధికారంలోకి రావటం ద్వారా బీజేపీ చరిత్ర సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అయితే 80 సీట్లు గెలుచుకోవటం ద్వారా రాహుల్ గాంధీ తన రాజకీయ చాతుర్యాన్ని చాటుకున్నారు. త‌ద్వారా వచ్చే ఏడాది నాలుగు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత 2019లో జరిగే లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బీజేపీకి గట్టిపోటీ ఎదురవుతుందనే సంకేతాన్ని గుజరాత్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఇదే స‌మ‌యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన స్థాయిలో బీజేపీ సీట్లు గెలుచుకోలేకపోయింది.

గుజరాత్‌ లో సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ ఓటమిపాలయ్యారు. అయితే కాంగ్రెస్‌ కు మద్దతు ప్రకటించిన ఆదివాసీ నాయకుడు జిగ్నేష్ మెవానీ ఘనవిజయం సాధించారు. గుజరాత్ పట్టణ ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించి గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ప్రచారం చేయటంతోపాటు అన్ని రకాల ఎత్తులను అమలు చేయటం వల్లే బీజేపీ అధికారంలోకి రాగలుగుతోందని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లు గెలుకుంటే ఈసారి 99కి పడిపోయింది. అంటే మోడీ ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. నరేంద్ర మోడీ 49 రోజుల ఎన్నికల ప్రచారంలో దాదాపు నలభై బహిరంగ సభల్లో ప్రసంగించటం ద్వారా ప్రజలకు పార్టీపట్ల విశ్వాసం కలిగించేందుకు కృషిచేశారు.

బీజేపీ 150 సీట్లు గెలుస్తుందంటూ అమిత్ షా చేసిన ప్రకటన నీరుగారిపోవటం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రజలు బీజేపీకి పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వలేదన్న విషయాన్ని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి మంత్రం గుజరాత్‌లో పనిచేసిన సూచనలు కనిపించటం లేదు. రాహుల్ గాంధీ గుజరాత్‌లో ఏర్పాటుచేసిన పటేల్ - బీసీ - ఆదివాసీ కూటమి కాంగ్రెస్‌ కు కలిసివచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. సౌరాష్ట్ర తదితర ప్రాంతాల్లో పటేల్ వర్గం పూర్తిస్థాయిలో కాంగ్రెస్‌ కు ఓటు వేసినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. నరేంద్ర మోడీ అభివృద్ధి మంత్రం పస లేనిదంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించినట్లు కనిపిస్తోంది. 80 సీట్లు సాధించటం ద్వారా రాహుల్ గాంధీ తన సత్తా చాటుకున్నారని చెప్పకతప్పదు. హార్దిక్ పటేల్ - అల్పేష్ థాకోర్ - జిగ్నేష్ మెవానీతో ఏర్పాటుచేసిన కూటమి బీజేపీని సమర్థంగా సవాల్ చేయటంతోపాటు వారి విజయావకాశాలను బాగా దెబ్బతీసింది. గత 22ఏళ్ల పాలనలో బీజేపీ సాధించిందేమీ లేదంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రచారం పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు బాగా కలిసి వచ్చినట్లు ఫలితాలు సూచిస్తున్నాయి. 2012లో కాంగ్రెస్ 61 సీట్లు గెలుచుకుంటే ఈసారి 80 సీట్లు గెలుచుకోవటం ఆ పార్టీకి ప్రజల మద్దతు పెరుగుతోందనేందుకు సంకేతమేన‌ని ఇది బీజేపీకి క‌ష్ట‌కాల‌మ‌ని అంటున్నారు.

ఇక‌ హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రం మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించింది. గుజరాత్ శాసనసభలో 182 సీట్లుంటే బీజేపీకి 99 సీట్లు లభిస్తే కాంగ్రెస్‌ కు 80 సీట్లు - ఇండిపెండెంట్లకు మూడు సీట్లు లభించాయి. హిమాచల్‌ ప్రదేశ్ శాసనసభలో 68 సీట్లుంటే బీజేపీకి 44 సీట్లు - కాంగ్రెస్‌ కు 21 - ఇండిపెండెంట్లకు మూడు సీట్లు లభించాయి. అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌ కుమార్ ధూమాల్ పరాజయానికి గురికావటం ఆందరినీ ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్‌ కు చెందిన ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.