Begin typing your search above and press return to search.

బ్యాడ్మింటన్ లాకర్లలో వందల కోట్ల డబ్బు!

By:  Tupaki Desk   |   23 July 2018 2:13 PM GMT
బ్యాడ్మింటన్ లాకర్లలో వందల కోట్ల డబ్బు!
X
రూ.500 కోట్ల విలువైన స్థిరాస్తి పత్రాలు - రూ.14 కోట్ల ఆస్తులు.. ఇందులో రూ.7-8 కోట్ల విలువైన వజ్రాలు - బంగారం - రూ.5.7 కోట్ల నగదు(ఇందులో విదేశీ కరెన్సీ రూ.3.9 కోట్లు) - ఖరీదైన గడియారాలు.. ఈ ఆస్తుల చిట్టాను చదువుతుంటేనే కండ్లు బైర్లు కమ్ముతున్నాయి కదూ..! ఇవి ఉన్నవి బ్యాంకులోని లాక‌ర్ల‌లో కాదు... బ్యాడ్మింటన్ క్లబ్‌ లో. ఔను. షాక్ అవ‌కండి. బెంగళూరులోని ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ క్లబ్‌ లో ఈ క‌ళ్లు తిరిగే సొత్తులు ఉన్నాయి. బోరింగ్ క్లబ్ పేరున్న ఈ క్ల‌బ్‌ లో ఇవ‌న్ని బ‌య‌ట‌ప‌డ్డాయి. బెంగళూరు నగరంలోని బౌరింగ్ ఇన్‌ స్టిట్యూట్ బ్యాడ్మింటన్ క్లబ్‌ లోని లాకర్లలో నుంచి ఈ భారీ నిధి బయటపడింది. స్థిరాస్తి వ్యాపారవేత్త అవినాశ్ అమర్‌ లాల్ కుక్రేజా (45)కు చెందినవిగా వీటిని గుర్తించారు.

బెంగ‌ళూరులో లాకర్లలో తమ క్రీడాసామాగ్రి పెట్టుకోవడానికి సభ్యత్వం కూడా ఇస్తారు. ప్రతి ఏడాది లాకర్ తీసుకున్న సభ్యుడు తన సభ్యత్వాన్ని పొడిగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఓ సభ్యుడు మాత్రం అలా చేయలేదు. ఎన్నోసార్లు క్లబ్ నిర్వాహకులు అతన్ని కోరినా.. పట్టించుకోలేదు. దీంతో అతని లాకర్లను మరొకరికి ఇవ్వాలని నిర్ణయించిన నిర్వాహకులు.. అతనికి చెందిన మూడు లాకర్లను తెరిచారు. అందులో ఉన్న వస్తువులు చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. బెంగళూరు నగరానికి చెందిన ఓ చిన్న వ్యాపారవేత్త అవినాశ్ అమర్‌ లాల్ కుఖ్రేజాకు చెందిన లాకర్లవి. అందులో రూ.3.96 కోట్ల నగదు - రూ.8 కోట్ల విలువైన వజ్రాలు - ఆభరణాలు - రూ.800 కోట్ల విలువైన బ్లాంక్ చెక్కులు - ఇతర ఆస్తుల డాక్యుమెంట్లు ఉన్నాయి. వాటిని చూసి షాక్ తిన్న క్లబ్ నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఇన్‌ కమ్‌ ట్యాక్స్ అధికారులకు వాటిని అప్పగించారు. అదే సమయానికి అవినాశ్ తన వస్తువులు తీసుకోవడానికి క్లబ్‌ కు వచ్చాడు. కావాలంటే డబ్బు మొత్తం తీసుకొని - ఆస్తుల పత్రాలు మాత్రం తనకు ఇవ్వాలని అవినాశ్ తన కాళ్ల మీద పడినట్లు క్లబ్ సెక్రటరీ వెల్లడించారు.

కొంతసేపటి తర్వాత మరో వ్యక్తి వచ్చి.. అందులోని ముఖ్యమైన ఒక డాక్యుమెంట్ కోసం రూ.5 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించగా.. అతడు కూడా కాళ్లపై పడ్డాడు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. శనివారం సాయంత్రానికి ఐటీ అధికారులు వాటి మొత్తం విలువను లెక్క కట్టారు. ఈ ఘటన తర్వాత నగరంలోని ప్రముఖ క్లబ్‌ లన్నీ తమ లాకర్లలో సభ్యులు ఏం దాచుకున్నారో తేల్చుకునే పనిలో పడ్డాయి. తమ క్రీడా సామాగ్రిని పెట్టుకోవడానికి వాడుకోవాల్సిన ఈ లాకర్లలో కోట్లకొద్దీ సొమ్ము పెట్టుకోవడం షాక్‌ కు గురిచేసింది. ఇలాంటి ఘటనల వల్ల మా క్లబ్ ప్రతిష్ట దెబ్బతింటుంది అని బోరింగ్ క్లబ్ గౌరవ కార్యదర్శి హెచ్ ఎస్ శ్రీకాంత్ చెప్పారు.

అవినాశ్ బెంగళూరులో ఓ టైర్ల షోరూమ్‌ ను నడుపుతున్నాడు. అతని పూర్వీకులు.. 1947లో దేశ విభజన తర్వాత ప్రస్తుతం పాకిస్థాన్‌ లో ఉన్న సింధ్ ప్రావిన్స్ నుంచి బెంగళూరు వచ్చి స్థిరపడ్డారు. అతని తండ్రి కూడా బెంగళూరులో బడా పారిశ్రామికవేత్త. అవినాశ్ తండ్రి ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు. అవినాశ్ కూడా ఓ ప్రముఖ భవననిర్మాణ సంస్థలో సభ్యుడిగా ఉన్నాడు. ఆస్తులను తనఖా పెట్టుకుని ప్రజలకు పెద్ద మొత్తంలో అప్పులిచ్చేవాడు. 1993లో బౌరింగ్ ఇన్‌ స్టిట్యూట్ క్లబ్‌ లో అవినాశ్ సభ్యత్వం తీసుకున్నాడు. సంపన్నులకు కేరాఫ్ అడ్రస్‌ గా ఉండే ఈ క్లబ్‌ లో సభ్యులకు ప్రత్యేకంగా లాకర్లను కేటాయించారు.

కాగా, అవినాశ్‌ కు మరో క్లబ్‌ లో సభ్యత్వం ఉండటంతో ఐటీ అధికారులు అక్కడి లాకర్లలో సోదాలు చేసినా.. అక్కడ ఏమీ దొరకలేదు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వెయ్యి కోట్లు ఉన్న ఆ ఆస్తుల పత్రాలు చూసి నగరం ఉలిక్కిపడింది. రాష్ట్రంలోని పేరున్న రాజకీయ నాయకుల బినామీ పత్రాలను అవినాశ్ తన దగ్గర పెట్టుకున్నట్లు అవినాశ్‌ తో సంబంధాలున్న ఇతర వ్యాపారవేత్తలు వెల్లడించారు. కొన్నేళ్లుగా అవినాశ్ హవాలా వ్యాపారం కూడా చేస్తున్నట్లు మరికొందరు ఆరోపించారు. బ్లాంక్ చెక్కులు - ఆస్తుల పత్రాలు తీసుకొని కోట్ల కొద్దీ డబ్బును అతడు అప్పుగా ఇస్తాడు. అతని దగ్గర డబ్బు తీసుకున్నవాళ్లలో అధికారులు - రియల్ ఎస్టేట్ - రాజకీయనాయకులు కూడా ఉన్నారు అని ఓ ఐటీ అధికారి చెప్పారు.