Begin typing your search above and press return to search.

తిరుపతి స్టైల్లోనే బద్వేలు ప్రచారం

By:  Tupaki Desk   |   25 Oct 2021 5:30 AM GMT
తిరుపతి స్టైల్లోనే బద్వేలు ప్రచారం
X
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో అనుసరించిన ప్రచారం వ్యూహాన్నే జగన్మోహన్ రెడ్డి బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో కూడా అనుసరిస్తున్నారు. బద్వేలు ఓటర్లకు జగన్ నుంచి లేఖలు అందుతున్నాయి. ఈనెల 30వ తేదీన జరగబోయే పోలింగ్ లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఓటర్లకు విజ్ఞప్తి పేరుతో జగన్ ప్రతి ఓటరు పేరుతో ప్రత్యేకంగా లేఖలు రాశారు. సదరు లేఖలను, కర ప్రతాలను స్ధానిక వైసీపీ నేతలు నియోజకవర్గంలోని ఓటర్లందరికీ పంచుతున్నారు.

తిరుపతి ఉపఎన్నికలో కూడా ముందు పెద్ద బహిరంగ సభ జరపాలనే అనుకున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా చివరి నిముషంలో బహిరంగ సభ ద్వారా ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. బహిరంగ సభ అంటే జనాలందరినీ ఒకేచోట చేర్చాలి కాబట్టి వారిలో ఎవరికైనా కరోనా వైరస్ వచ్చే ప్రమాదముందని బహిరంగసభ ఆలోచనను విరమించుకున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్లకు జగన్ లేఖలు రాశారు. జగన్ పేరుతో వచ్చిన లేఖలను స్థానిక నేతలు ఓటర్లందరికీ పంచారు.

ఇపుడు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. బహిరంగ సభ నిర్వహిస్తే కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంది కాబట్టి తాను బహిరంగ సభ ద్వారా చేయాలని అనుకున్న ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్లు జగన్ తన లేఖలో స్పష్టంగా చెప్పారు. తమ అభ్యర్ధి దాసరి సుధను భారీ మెజారిటితో గెలిపించాలని ఓటర్లకు లేఖ ద్వారా జగన్ విజ్ఞప్తి చేశారు. ఇపుడా లేఖలను పార్టీ నేతలు నియోజకవర్గంలో ఓటర్లందరికీ పంచుతున్నారు.

ఇదే సమయంలో ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు, నేతలు మాత్రం తమ ప్రచారాన్ని చేసుకుంటున్నారు. అయితే జగన్ ప్రచారానికి, పై రెండు పార్టీలు చేసుకుంటున్న ప్రచారానికి చాలా తేడా ఉంటుంది. ఇపుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రచారాన్ని జనాలెవరు పెద్దగా పట్టించుకోవటంలేదు. బీజేపీ అభ్యర్థి సురేష్ కు మద్దతుగా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మంత్రులు వస్తున్నా జనాలు ఎవరు పట్టించుకోవటం లేదు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం కూడా దాదాపు ఇలాగే సాగుతోంది.

కానీ జగన్ ప్రచారానికి వస్తే వాతావరణం పూర్తిగా మారిపోతోంది. ఎందుకంటే కడప జిల్లాతో వైఎస్ కుటుంబానికి ఉన్న అనుబంధం అలాంటిది. పైగా జగన్ ఇపుడు ప్రచారానికి వస్తే సీఎం హోదాలోనే వస్తారు. దాంతో పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు అధికార యంత్రాంగం హడావుడి కూడా ఉంటుంది. ఎక్కువమంది జనాలు ఒకచోట గుమిగూడటం, ఇలాంటి హడావుడి అంతా ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. ఇదే విషయాన్ని జగన్ తన లేఖలో స్పష్టంగా చెప్పారు. కాబట్టి అభ్యర్థి గెలుపు బాధ్యత పూర్తిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు+నేతలదే.