Begin typing your search above and press return to search.

కంచె ఐల‌య్య‌కు మ‌ద్ద‌తుగా ఇంకో వేదిక‌

By:  Tupaki Desk   |   4 Oct 2017 3:30 PM GMT
కంచె ఐల‌య్య‌కు మ‌ద్ద‌తుగా ఇంకో వేదిక‌
X
సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు అనే పుస్త‌కంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన రిటైర్డ్ ప్రొఫెస‌ర్ కంచె ఐల‌య్యకు బాస‌ట‌గా మ‌రికొన్ని సంఘాలు ముందుకు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే టీ మాస్ పేరుతో తెల‌గాణ‌లోని ప్ర‌జాస్వామ్య‌ - ప‌లు కుల‌సంఘాలు ఐల‌య్య‌కు మ‌ద్ద‌తు తెలుప‌గా తాజాగా మ‌రో వేదిక ఆయ‌న‌కు సంఘీభావం తెలిపింది. బహుజన ప్రతిఘటన సభ పేరుతో ప‌లువురు ఉద్యమకారులు - కవులు - కళాకారులు - రచయితలు - మేదావులు ఐల‌య్య‌కు త‌మ సంఘీభావం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప‌లు తీర్మానాలు కూడా చేశారు.

త‌ను రాసిన పుస్త‌కం కార‌ణంగా వైశ్యులు ఎక్కడ దాడి చేస్తారేమోనన్న భయంతో ఐలయ్య బెంగుళూరులో దాక్కున్నాడని ఓ పత్రికలో వ‌చ్చిన క‌థ‌నం అబ‌ద్ద‌మ‌ని బహుజన సమితి నాయకులు ఉసా స్ప‌ష్టం చేశారు. ప్రముఖ సాహితీ విమర్శకులు అంబటి సురేంద్ర రాజు మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర ఉందని చెప్పుకునే కమ్యూనిస్టు ఉద్యమాలు కులాన్ని దాచిపెట్టి వ‌ర్గం అంటూ పోరాటాలు చేస్తుండ‌టాన్ని ఇంకెన్నాళ్లు కొన‌సాగిస్తార‌ని ప్ర‌శ్నించారు. ఐల‌య్య పోరాటం అభినంద‌నీయ‌మ‌ని ప్రొఫెసర్ బాలబోయిన సుదర్శన్ కొనియాడారు. ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు గౌరీ లంకేష్ హంతకులను వెంటనే అరెస్టు చేయాలని ఈ సంద‌ర్భంగా స‌భ తీర్మానం చేసింది. హంతకుల వెనక వున్న వ్యక్తులను, సంస్థలను ప్రకటించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. లింగాయత్ మతంతో పాటు రవిదాసీయ మతం - కబీరు మతం - చొక్కమేల మతం - సిక్కుమతం - శైవమతం - వైష్టవ మతం - పోతులూరి వీరబ్రహ్మం మతాలు హిందూమతంలో భాగం కాద‌ని పేర్కొంటూ వాటిని కూడా స్వతంత్ర మతాలుగా గుర్తించాలని డిమాండ్ చేసింది.

ప్ర‌ముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కు సభ సంఘీభావం ప్రకటించిన సభ‌.... బహుజన మేధావుల మీద జరుగుతున్న దాడులను ప్రతిఘటించాలని పిలుపునిచ్చింది. కంచ ఐలయ్యను మానసిక హింసకు గురిచేస్తున్న ఆర్యవైశ్య సంఘ నాయకులను - స్వామి పరిపూర్ణానందను వెంటనే అరెస్టు చేయాలి. ఆయన మీద దాడికి ప్రయత్నించిన వాళ్లను కఠినంగా శిక్షించాలని ఈ సంద‌ర్భంగా తీర్మానం చేశారు. అంతేకాకుండా రాబోయే ఎన్నిక‌ల్లో వైశ్యుల‌ను ఓడించాల‌ని ఈ వేదిక ఎస్సీ - ఎస్టీ - బీసీల‌కు పిలుపునిచ్చింది. ఐలయ్య మీద దాడిని సమర్ధించిన మంత్రులు కేటిఆర్ - హరీష్ రావులను 2019 ఎన్నికల్లో బీసీ - ఎస్సీ - ఎస్టీ - ముస్లింలు - క్రైస్తవులు ఓడించాలని సభ పిలుపునిచ్చింది.