Begin typing your search above and press return to search.

జ‌డ్జి రామ‌కృష్ణ‌కు బెయిల్‌.. కానీ.. ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి!

By:  Tupaki Desk   |   15 Jun 2021 11:30 AM GMT
జ‌డ్జి రామ‌కృష్ణ‌కు బెయిల్‌.. కానీ.. ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి!
X
సీఎంపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని.. పేర్కొంటూ.. పోలీసులు రాజ‌ద్రోహం కేసు కింద కేసు న‌మోదు చేసి అరెస్టు చేసి.. జైల్లో పెట్టిన ద‌ళిత మేధావి, జ‌డ్జి రామ‌కృష్ణ‌కు ఎట్ట‌కేల‌కు బెయిల్ ల‌భించింది. రాష్ట్ర హైకోర్టు.. ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. కొన్ని ష‌ర‌తులు విధించింది. రాజ‌ద్రోహం కేసుపై అరెస్ట‌యిన జ‌డ్జి రామ‌కృష్ణ‌ని.. తొలుత తిరుప‌తి జైల్లో ఉంచారు. ఆ స‌మయంలో ఆయ‌న‌కు క‌రోనా సోక‌డంతో రుయా ఆసుప‌త్రిలో చికిత్స చేయించారు.

అనంత‌రం.. ఆయ‌న‌ను చిత్తూరు జిల్లా పీలేరు కేంద్ర కారాగానికి త‌ర‌లించారు. ఇక‌, ఈసమ‌యంలో ఒకే జైలు గ‌దిలో ఉన్న తోటి ఖైదీ నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని.. త‌న‌ను చూసేందుకు వ‌చ్చిన త‌న కుమారుడి ముందు ఆయ‌న వాపోయారు. దీంతో ఆయ‌న కుమారుడు హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి స‌హా.. జిల్లా పోలీసు ఐజీకి లేఖ రాశారు. త‌న తండ్రికి ప్రాణ‌హాని ఉంద‌ని వాపోయారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌హా టీడీపీ నేత‌లు రామ‌కృష్ణ విష‌యంపై స్పందిస్తూ.. త‌క్ష‌ణ‌మే ఆయ‌న‌కు బెయిల్ ఇచ్చి బ‌య‌ట‌కు పంపాల‌ని డిమాండ్ చేశారు.

జ‌డ్జి రామ‌కృష్ణ‌కు ప్రాణ‌హాని ఉంద‌న్న వార్త‌లు, ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌ను వేరే గ‌దికి మార్పు చేశారు. ఇక‌, బెయిల్ పిటిష‌న్‌పై ప‌లు మార్లు విచార‌ణ జ‌రిపిన‌.. హైకోర్టు.. తాజాగా ఆయ‌న‌కు రూ.50 వేల పూచీ క‌త్తుతో బెయిల్ మంజూరు చేసింది. అదేస‌మ‌యంలో కొన్ని ష‌ర‌తులు విధించింది. విచారణాధికారికి సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. కేసు అంశంపై మీడియాతో మాట్లాడవద్దని తెలిపింది. ఈ మేరకు జడ్జి రామకృష్ణకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.