Begin typing your search above and press return to search.

లాలూకు బెయిలు.. జైలు నుంచి ఇంటికి

By:  Tupaki Desk   |   22 April 2022 10:15 AM GMT
లాలూకు బెయిలు.. జైలు నుంచి ఇంటికి
X
రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (73) కు బెయిల్ మంజూరైంది. బిహార్ ను ఒకప్పుడు కంటిచూపుతో ఏలిన లాలూకు.. జీవిత చరమాంకంలో ఇది కొంత ఊరటే. ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లభించింది. లాలూ ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. డొరండ ట్రెజరీ కేసులో జార్ఖండ్ హైకోర్టు బెయిలిచ్చింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు ఆయనకు సీబీఐ కోర్టు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

సగం శిక్షా కాలం జైలులో గడపటం, ఆరోగ్య సమస్యను పరిగణనలోకి తీసుకుని ఈ ఉపశమనం ఇచ్చిందని లాలూ న్యాయవాది తెలిపారు. రూ.లక్ష పూచీకత్తును సమర్పించాలని, రూ.10 లక్షలు జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆయనను ఆదేశించినట్లు చెప్పారు. లాలూకు రాంచీలోని స్పెషల్ సీబీఐ కోర్టు ఐదేళ్ళ జైలు శిక్ష, రూ.60 లక్షలు జరిమానా విధించింది. ఈ కుంభకోణం జరిగిన సమయంలో లాలూ బిహార్ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బాధ్యతలను నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

పశుసంవర్ధక శాఖ ఇచ్చిన బూటకపు చలానాలు, బిల్లులను ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లియర్ చేసిందని, ఆ సొమ్మును ట్రజరీ ద్వారా విడుదల చేశారని కేసు నమోదైంది. డొరండ ట్రెజరీ నుంచి 1995-96లో రూ.139.35 కోట్లు అక్రమంగా విడుదలైనట్లు ఆరోపణలు నమోదయ్యాయి.

లాలూను పతనం చేసినా దాణాఅది 1991 సంవత్సరం.. లాలూ ఉమ్మడి బిహార్ సీఎం. ఇటుచూస్తే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎల్ కే అద్వాణీ రథయాత్ర. దేశమంతా తిరుగుతూ అద్వానీ రథయాత్ర బిహార్ చేరింది. కానీ, లౌకిక లాలూ దానిని అడ్డుకున్నారు. దీంతో యాత్ర ద్వారా అద్వానీకి ఎంత పేరు వచ్చిందో.. అడ్డుకున్న లాలూకూ అంతే పేరొచ్చింది. లాలూ.. అద్వానీ అరెస్టు చేసేందుకూ వెనుకాడలేదు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేక శక్తిగా లాలూ పేరు తెచ్చుకున్న సందర్భం అది. అలాంటి లాలూ 1995 తర్వాత దాణా కుంభకోణంతో అప్రదిష్ట పాలయ్యారు.

జైలుకెళ్లాల్సిన పరిస్థితుల్లో భార్య రబ్రీని సీఎం చేశారు. నాటి నుంచి 2004-2009 మధ్య మినహా లాలూ ప్రాభవం తగ్గతూనే ఉంది తప్ప పెరగలేదు. అలాంటి లాలూ పార్టీ ఆర్జేడీ గతేడాది బిహార్ ఎన్నికల్లో గెలిచేలా కనిపించింది. లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ సారథ్యంలో పునర్ వైభవం సాధించేలా కనిపించింది. కానీ, కాంగ్రెస్ పార్టీ పుట్టిముంచింది. పొత్తులో భాగంగా 70 సీట్లు తీసుకున్న కాంగ్రెస్ 19 స్థానాల్లో మాత్రమే గెలిచింది. తాను ఓడడమే కాక.. మహా కూటమి ఓడించింది. దీంతో తేజస్వి ప్రతిపక్ష నేత పాత్రకే పరిమితం అయ్యారు.

లాలూ వచ్చినా పార్టీని పైకి లేపగలరా?లాలూ ప్రసాద్ వయసు 73 ఏళ్లు. ఆయన వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గంతలో ఎయిమ్స్ లోనూ చికిత్స పొందారు. ఇప్పుడు ఆయన క్రియాశీలమై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినా శరీరం ఏమేరకు సహకరిస్తుందో చెప్పలేం. కాకపోతే కరిష్మా కొంత ఉపయోగపడుతుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోరాడేందుకు పార్టీకి మరింత శక్తినిస్తుంది.