Begin typing your search above and press return to search.

జార్జ్ హత్య : ఆ పోలీస్ బెయిల్‌ ఖరీదు 9.5 కోట్లు!

By:  Tupaki Desk   |   9 Jun 2020 7:10 AM GMT
జార్జ్ హత్య : ఆ పోలీస్ బెయిల్‌ ఖరీదు 9.5 కోట్లు!
X
అమెరికా గత కొన్నిరోజులుగా నిరసనలతో హోరెత్తుతోంది. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకి వ్యతిరేకంగా చాలామంది రోడ్లపైకి వచ్చి మారణహోమం సృష్టిస్తున్నారు. ఈ అల్లర్లకు ప్రధాన సూత్రధారి అయిన జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి కారణమైన శ్వేతజాతి పోలీసు ఆఫీసర్‌ డెరిక్‌ చౌవిన్‌ కు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. సోమవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా చౌవిన్‌ కోర్టు విచారణకు హాజరయ్యాడు. అతనిపై హత్య కేసులో అభియోగం నమోదు అయ్యింది. ఫ్లాయిడ్‌ ను హత్య చేసిన చౌవిన్‌కు 9.5 కోట్లకు (1.25 మిలియన్‌ డాలర్లు) బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయమూర్తి అంగీకరించారు.

ఇక ఆ పోలీస్ ఆఫీసర్ షరతులకు అంగీకరిస్తే, అప్పుడు కేవలం మిలియన్‌ డాలర్లకే బెయిల్‌ ఇవ్వనున్నారు. హూస్టన్‌ లో ఫ్లాయిడ్‌ సంస్మరణ సభ జరుగుతున్న సమయంలోనే కోర్టు విచారణ కూడా కొనసాగింది. ఈ క్రమంలో హెన్నెపిన్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి జెన్నిస్ రెడింగ్, చౌవిన్ ‌కు షరతులుతో 1 మిలియన్‌ డాలర్ల పూచీకత్తుతో, షరతులు లేకుండా 1.25 మిలియన్‌ డాలర్ల పూచీకత్తు తో బెయిల్‌ మంజూరు చేశారు. చౌవిన్‌ వద్ద ఉన్న ప్రభుత్వ ఆయుధాలను తిరిగి ఇచ్చేయడమే కాక.. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సెక్యూరిటీ విభాగాల్లో పని చేయకూడదని కోర్టు ఆదేశించింది.

అంతేకాక ఫ్లాయిడ్‌ కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండకూడదని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ కేసులో చౌవిన్‌తో పాటు ఉన్న మరో ముగ్గురు పోలీసులు హత్యకు సహకరించారనే అభియోగం మీద స్థానిక జైలులో ఉన్నారు. మిన్నియాపోలిస్‌ లో ఫ్లాయిడ్‌ ను నేలపై పడేసి.. పోలీసు ఆఫీసర్‌ చౌవిన్‌ తన మోకాలితో అతని మెడను సుమారు 9 నిమిషాల పాటు నొక్కిపెట్టాడు. దీంతో ఫ్లాయిడ్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో అమెరికా అంతటా ఆందోళనలు మిన్నంటాయి. పోలీసులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. జాత్యాంహకార దాడులు జరుగుతున్నాయంటూ నల్లజాతీయులు హింసాత్మక ఆందోళనలకు దిగారు.