Begin typing your search above and press return to search.

వైసీపీ ఫైర్ బ్రాండ్ చాలెంజ్‌కు ప్ర‌తిప‌క్షాలు సిద్ధ‌మేనా?

By:  Tupaki Desk   |   28 Sep 2022 9:34 AM GMT
వైసీపీ ఫైర్ బ్రాండ్ చాలెంజ్‌కు ప్ర‌తిప‌క్షాలు సిద్ధ‌మేనా?
X
వైసీపీలో ఫైర్ బ్రాండ్.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. యూత్ ఫాలోయింగ్ ఉన్న అతికొద్ది మంది నేత‌ల్లో సిద్ధార్థ్ రెడ్డి ఒక‌రు. క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న బైరెడ్డికి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం రాలేదు. నందికొట్కూరు ఎస్సీ రిజ‌ర్వుడ్ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డ‌మే గ‌మ‌నార్హం. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేద్దామ‌నుకున్నా అక్క‌డి గ‌ట్టి నేత‌లు ఉండ‌టంతో కుద‌ర‌లేదు. అయితే బైరెడ్డి లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నేత‌ల‌ను వాడుకోవాల‌నుకున్న జ‌గ‌న్ ఆయ‌న‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) చైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు.

ప్ర‌స్తుతం శాప్ చైర్మ‌న్ హోదాలో ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ ప్ర‌భుత్వంపైన ఎలాంటి వ్య‌తిరేక‌తా లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ప్ర‌తిప‌క్ష నేత‌లు టీవీ డిబేట్ల‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపైన తీవ్ర వ్య‌తిరేకత ఉంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోతుంద‌ని ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అవినీతి, లంచం లేకుండా కుల‌మ‌తాల‌క‌తీతంగా అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను సీఎం జ‌గ‌న్ అమ‌లు చేస్తున్నార‌ని గుర్తు చేశారు.

నేరుగా ఈ ప‌థ‌కాల ప్రయోజ‌నాల‌ను ప్ర‌జ‌ల ఖాతాల్లోనే వేస్తున్నార‌ని.. వచ్చే ఎన్నిక‌ల్లో ఈ ప‌థ‌కాలే వైసీపీని గెలిపిస్తాయ‌ని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. టీడీపీతో స‌హా ఇత‌ర ప్ర‌తిప‌క్షాలు త‌మ‌పై ఎంత దుష్ప్ర‌చారం చేసినా జ‌రిగేది మాత్రం ఇదేన‌ని తేల్చిచెప్పారు.

ప్ర‌భుత్వ సంక్షేమ పథకాలపై టీడీపీ, ఇతర పార్టీలు చేస్తోన్నవన్నీ దుష్ప్రచారాలేనన్న సంగ‌తి ప్రజలకు కూడా తెలుసని ఈ యువ నేత అంటున్నారు. ఏ పార్టీకి ఓట్లు వేస్తామ‌నే విష‌యాన్ని ప్ర‌జ‌లు ముందే చెప్ప‌ర‌ని.. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు వారు ఏ పార్టీకి ఓటేయాలో ఆ పార్టీకే ఓటేస్తార‌ని సిద్ధార్థ్ రెడ్డి చెబుతున్నారు. త‌మ‌ ప్రభుత్వంపై ప్రజల్లో అసమ్మతి, వ్యతిరేకత బాగా పెరిగిపోయాయ‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు చెబుతుంటే క‌నుక వారు కాలక్షేప రాజకీయాలు చేస్తున్నట్టేనన్నారు.

వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని చెప్పే ప్ర‌తిప‌క్ష నేత‌లు ద‌మ్ముంటే తన స‌వాల్ ను స్వీక‌రించాల‌ని బైరెడ్డి కోరారు. ఇంకో ఏడాదిన్న‌ర‌లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో మళ్లీ బంపర్ మెజారిటీతో గెలుస్తామనే నమ్మకం తన‌కు ఉంద‌ని తెలిపారు. ఒక‌వేళ ప్ర‌తిప‌క్షాలు ఆశించిన‌ట్టు వైసీపీ గెల‌వ‌క‌పోతే త‌న‌తో స‌హా వైసీపీ నేత‌లంతా రాజకీయాల నుంచి త‌ప్పుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని చాలెంజ్ చేశారు.

మ‌రి వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిస్తే ఇప్పుడు మాట్లాడుతున్న ప్ర‌తిప‌క్ష నేత‌లంతా రాజ‌కీయాల నుంచి వైదొలుగుతారా అని బైరెడ్డి ప్ర‌శ్నించారు. వైసీపీ ఓడిపోతే తాము రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటామ‌ని, వైసీపీ గెలిస్తే ప్ర‌తిప‌క్ష నేత‌లు రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటారా అని స‌వాల్ విసిరారు.

కాగా ఇటీవ‌ల బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వైసీపీలో అసంతృప్తిగా ఉన్నార‌ని.. ఆ పార్టీ నుంచి వైదొలుగుతార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ మేర‌కు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ తో కూడా భేటీ అయిన‌ట్టు గాసిప్స్ గుప్పుమ‌న్నాయి. అయితే ఇవేమీ నిజం కాలేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.