Begin typing your search above and press return to search.

ప్రేమికుల రోజు దుశ్చర్య.. పోలీసుల ట్రీట్ మెంట్

By:  Tupaki Desk   |   15 Feb 2019 6:09 AM GMT
ప్రేమికుల రోజు దుశ్చర్య.. పోలీసుల ట్రీట్ మెంట్
X
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బలవంతపు పెళ్లిళ్లు చేసిన ఆరుగురు భజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వాలెంటైన్స్‌ డే సందర్భంగా కొందరు కాషాయం జెండాలు పట్టుకొని హిందుత్వ వాదులు పార్కుల వెంబడి తిరిగారు. ప్రేమికులు కనిపించగానే వారికి బలవంతంగా తాళి కట్టించి పెళ్లి జరిపించారు. హైదరాబాద్‌ లోని పలు పార్కుల్లో కొందరు హిందూ యాక్టివిస్టులు బలవంతపు పెళ్లిళ్లు చేయడమే కాకుండా వారితో సెల్ఫీలు దిగి వీడియోలను తీసి సామాజిక మాధ్యమాల్లో వదిలారు.

హైదరాబాద్‌ లోని ఆక్సిజన్‌ పార్కులో ఓ జంటకు కొందరు బలవంతంగా వివాహం చేశారు. ఈ సంఘటనపై అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ దూరపు బంధువు అబ్బాయితో పార్కుకు వెళ్తే బలవంతంగా పెళ్లి చేశారని ఆయన బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. దీంతో డీసీపీ పద్మజ కేసు నమోదు చేసారు.బలవంతంగా వివాహం జరిపించిన శ్రీహరిచారి - ఆనంద్‌ - అవినాశ్‌ - సురేశ్‌ కుమార్‌ - చంద్రశేఖర్‌ లను అరెస్టు చేశారు. వీరిపై ఐపీసీ 342 - 354 - 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఆమె తెలిపారు.

బాలికపై అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా యువకుడిని కొట్టి బలవంతంగా పెళ్లి చేశారని అమ్మాయి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా బలవంతంగా చేసిన పెళ్లి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అలాగే నగరంలోని మరి కొన్ని పార్కుల్లో కొందరు ప్రేమికులను పరుగులు పెట్టిస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి.. మరికొన్ని చోట్ల కొందరు యువకులపై దాడి చేసిన వీడియోలను కూడా షేర్‌ అవుతున్నాయి. ఇలా ప్రేమికుల దినోత్సవం కాస్త హిందుత్వ వాదులతో ప్రేమికులకు పీడకలగా మారిపోయింది.