Begin typing your search above and press return to search.

శివసేనకు ఊపిరాడకుండా చేస్తున్న బాల్ ఠాక్రే నాటి మాటలు

By:  Tupaki Desk   |   12 Nov 2019 7:03 AM GMT
శివసేనకు ఊపిరాడకుండా చేస్తున్న బాల్ ఠాక్రే నాటి మాటలు
X
తమ చేతిలో ఉండాల్సిన అధికారం చేతికి అందకుండా చేసిన శివసేన మీద నిప్పులు చెరుగుతున్న కమలనాథులు. ఎన్నికల వేళ మిత్రపక్షంగా నిలిచి.. 50-50 ఫార్ములా పేరుతో తమ చేతికి పవర్ రాకుండా చేసిన వైనాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సైద్ధాంతిక వైరుధ్యాల్ని వదిలేసి.. అధికారమే ప్రధానమన్నట్లుగా శివసేన వ్యవహరిస్తుందంటూ మండిపడుతున్న వారి తీరు శివసేనను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఊపిరాకుండా చేస్తున్న పరిస్థితి.

ఏదైనా విషయంలో తమ వాదనను బలంగా వినిపించటమే కాదు.. ప్రజల్లో ఒక భావనను కలిగించే విషయంలో కమలనాథులకున్న పట్టు శివసేనకు లేదనే చెప్పాలి. తాము అధికారంలో ఉన్న వేళ సుదీర్ఘకాలంగా మిత్రుడిగా ఉన్న శివసేనను ఆరో వేలుగా చూసిన వైనాన్ని బీజేపీ నేతలు అస్సలు గుర్తుకు తెచ్చుకోకపోగా.. అందుకు భిన్నంగా శివసేనకు రోజులు దగ్గర పడ్డాయంటూ శాపనార్థాలు పెడుతున్నారు.

శివసేన అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీరుతో బాల్ సాహెబ్ ఆత్మ క్షోభిస్తుందన్న ఆయన..అధికారం ఎవరి చేతిలో ఉండాలన్న దానిపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని గుర్తు తెచ్చి మరీ తిట్టిపోస్తున్నారు. టైగర్ బాలా ఠాక్రే మాటంటే మీకు విలువ లేదా? గతంలో ఆయన చెప్పిన మాటలేంటి? మీరిప్పుడు చేస్తున్నదేమిటి? అంటూ కమలనాథులు కొత్తతరహా మైండ్ గేమ్ షురూ చేశారు.

కాంగ్రెస్ నేతల మీద బాల్ ఠాక్రే తీవ్రంగా దునుమాడేవారని.. వారి పొడ కూడా ఆయనకు గిట్టదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సోనియాగాంధీని ఇటలీ మహిళగా అభివర్ణించిన నాటి మాటల్ని మర్చిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. సోనియా గాంధీ చెంచాల గురించి తన నోటితో తాను చెప్పలేని రీతిలో బాల్ ఠాక్రే ఎన్నోసార్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారన్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

గతంలో ఒక ఇంటర్వ్యూలో బాల్ ఠాక్రే చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తున్న కమలనాథులు..ఎవరు ఇక్కడ ముఖ్యమంత్రి అన్న విషయం ముఖ్యం కాదని.. తొలుత తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే ముఖ్యమన్నది బాల్ ఠాక్రే మాటను మరిచారా? అని ప్రశ్నిస్తున్నారు.

ఏ పార్టీకి ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ పార్టీ నేత సీఎం కావాలన్నది బాల్ ఠాక్రే మాట అని.. అదే న్యాయం.. అదే ధర్మమని అప్పట్లో ఆయన విషయాన్ని ఎలా విస్మరిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల వేళలో కాంగ్రెస్.. ఎన్సీపీ నేతల్ని తీవ్రంగా దుయ్యబట్టిన శివసేన అధినాయకత్వం అధికారం కోసం ఇప్పుడు వారితో కలిసే ప్రయత్నం చేయటం ఏమిటని మండిపడుతున్నారు. కమలనాథుల మాటలు శివసేనను ఉక్కిరిబిక్కిరి చేయటమే కాదు.. ఊపిరి ఆడనట్లుగా చేస్తోంది.