Begin typing your search above and press return to search.

రాజ‌కీయ వ్యూహంతోనే ఎన్టీఆర్ జిల్లా: బాల‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   5 Feb 2022 7:34 AM GMT
రాజ‌కీయ వ్యూహంతోనే ఎన్టీఆర్ జిల్లా:  బాల‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ఏపీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌తిపాదించిన 13 కొత్త జిల్లాల్లో కృష్ణాజిల్లాలోని విజయవాడ పశ్చిమ, సెంట్ర‌ల్‌, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజ‌క‌వ‌ర్గాల‌తో విజ‌య‌వాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయ‌నున్నారు. విజయవాడ, నందిగామ, తిరువూరు రెవెన్యూ డివిజ‌న్లతో మొత్తం 20 మండలాలు ఉంటాయి. దీంతో వైసీపీలోని కీలక నేత‌లు స‌హా మంత్రులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.. ఇక‌, చంద్ర‌బాబు కూడా పెడితే కాదంటామా? అన్నారు. అన్న‌గారి కుటుంబంలో రామ‌కృష్ణ ఏకంగా సీఎం జ‌గన్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

అయితే.. కీల‌క‌మైన నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే, న‌టుడు బాల‌య్య మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు త‌న తండ్రి పేరుతో ఏర్పాటు చేయ‌నున్న జిల్లా విష‌యంపై ఎక్క‌డా స్పందించ‌లేదు. కానీ, ఇప్పుడు తాజాగా ఆయన ఈ విష‌యంపై ఫ‌స్ట్ టైమ్ రియాక్ట్ అయ్యారు. అనంత‌పురం జిల్లాలోని త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం.. హిందూపురం కేంద్రం గా శ్రీస‌త్య‌సాయి జిల్లాను ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తూ.. రెండు రోజులుగా ఇక్క‌డ బాల‌య్య క‌దం తొక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జిల్లాపై స్పందించారు.

``ఎన్టీఆర్ జిల్లా అనే పేరును ప్ర‌భుత్వం త‌న స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటోంది. ఎన్టీఆర్‌పై వారికి భ‌క్తీ లేదు. భ‌య‌మూ లేదు. ఉంటే.. ఆయ‌న పేరుతో ఉన్న ప‌థ‌కాల‌ను ఎందుకు ఆపేస్తారు. ఎన్టీఆర్‌పై అంత ప్రేమ ఉన్న‌వాళ్లు.. అన్న‌గారి విగ్ర‌హాల‌ను కూల్చేస్తుంటే.. ఎందుకు మౌనంగా ఉంటారు. ఇదంతా పొలిటిక‌ల్ స్టంట్‌.. అంత‌కుమించి రాజ‌కీయ కుట్ర‌. పైపైన ప్ర‌జ‌ల‌ను ఇప్పుడున్న ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త నుంచి దారి మ‌ళ్లించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నం. `` అని నిప్పులు చెరిగారు.

``నిజంగానే ప్ర‌భుత్వం మ‌న‌స్పూర్తిగా ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టి ఉంటే.. స్వాగ‌తించేవాళ్లం. కానీ.. అంతా స్వార్థంతో.. చేసిన ప‌ని. భ‌క్తి భ‌గ‌వంతుడిపైనా.. చిత్తం చెప్పుల‌పైనా ఉన్న‌ట్టుగా.. ఉన్న ప్ర‌బుత్వం.. ఎన్టీఆర్ పేరును రాజ‌కీయంగా వాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అంత‌కుమించి.. ఏమీ లేదు`` అని బాలయ్య తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్యానించారు. త్వ‌ర‌లోనే ఈ ప్ర‌భుత్వం దిగిపోవాల‌ని.. ప్ర‌జ‌లు కోరుకుంటున్న‌ట్టు బాల‌య్య చెప్పారు. హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసే వ‌ర‌కు త‌మ ఉద్య‌మం ఆగ‌బోద‌న్నారు.