Begin typing your search above and press return to search.

ఆ నటుడి అక్రమ సంబంధాన్నిపట్టించిన ‘కారు’

By:  Tupaki Desk   |   16 Nov 2015 5:57 AM GMT
ఆ నటుడి అక్రమ సంబంధాన్నిపట్టించిన ‘కారు’
X
నేరం చేసినోడు దొరికిపోవటం ఖాయం. కాకుంటే.. ఒకరోజు అటో ఇటో మాత్రమే. ఈ విషయం మరోసారి నిరూపితమైంది. వర్థమాన సినీనటుడు బాలప్రశాంత్ అనుమానాస్పద రీతిలో మరణించటం.. అతడి మరణం వెనుక అక్రమ సంబంధం కారణమని తేలటం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఒక కొత్త విషయాన్ని పోలీసులు చెబుతున్నారు. తన వివాహిత ప్రియురాల్ని కలుసుకునేందుకు వచ్చిన సమయంలో బాల ప్రశాంత్ తన స్కోడా కారులో రావటమే అతన్ని పట్టుకునేలా చేయటంతో పాటు.. అతడి చావుకు కారణమైందని చెబుతున్నారు.

ఈ నెల 13న తన భర్త ఒక ఫంక్షన్ కోసం వేరే ఊరికి వెళ్లటంతో బాల ప్రశాంత్ ను సదరు వివాహిత ప్రియురాలు ఇంటికి రావాలని ఆహ్వానించింది. మరోవైపు ఆమె భర్త.. తన భార్య ఇంటి దగ్గర ఒంటరిగా ఉందని కాస్త తోడుగా ఉండటానికి ఇంటికి వెళ్లాలని బావమరిదికి ఫోన్ చేశాడు. దీంతో.. అతను ఇంటికి వెళ్లి తలుపు కొడితే.. తాను నిద్ర పోతున్నానని.. ఇంటికి వెళ్లిపోవాలని సోదరుడికి చెప్పటంతో ఆ విషయాన్ని బావమరిది బావకు చెప్పి తన ఇంటికి వెళ్లబోయాడు.

ఇక్కడే కథ ఊహించని మలుపు తిరిగింది. బావమరిది చెప్పిన మాట వెంటనే.. సెల్లార్ లో ఉన్న కార్ల గురించి చెప్పాలని అడిగినప్పుడు.. స్కోడా కారు ఉందని చెప్పటంతో భర్తకు అనుమానం వచ్చింది. అనంతరం తన అక్కా బావలకు ఫోన్ చేసి.. విషయం చెప్పి ఇంటికి వెళ్లాలని కోరాడు. వారు వెళ్లి తలుపు కొట్టటంతో తనను అవమానించారని.. ప్రశాంతంగా ఉండనీయ్యరా అంటూ చేతులు కోసుకుంటూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో మంచం కింద బాల ప్రశాంత్ ను దాచి పెట్టినట్లుగా భావిస్తున్నారు.

తాను ఆసుపత్రికి వెళ్లిన సమయంలో.. ప్లీజ్.. ఎలాగైనా తప్పించుకో అని బాలకిషన్ కు మెసేజ్ పెట్టింది. దీనికి అతడు.. అలాగే అంటూ తిరిగి బదులిచ్చాడు. ఇంటి నుంచి తప్పించుకునే క్రమంలో ఇంటికున్న పైపుల సాయంతో కిందకు దిగే ప్రయత్నం చేసి.. జారి పడిపోయాడు. దీంతో.. అతను ఘటనాస్థలంలో మరణించాడు. వివాహిత ప్రియురాలి ఇంటికి వచ్చేందుకు తాను తీసుకొచ్చిన స్కోడా కారు వీరి అక్రమ బంధాన్ని గుట్టు రట్టు చేయటమే కాదు.. అతడు చనిపోవటానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.