Begin typing your search above and press return to search.

బాలాజీ కాదు తిరుప‌తి.. రెవిన్యూ డివిజ‌న్ల పెంపు!

By:  Tupaki Desk   |   29 March 2022 7:30 AM GMT
బాలాజీ కాదు తిరుప‌తి.. రెవిన్యూ డివిజ‌న్ల పెంపు!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జిల్లాల పున‌ర్విభ‌జ‌న దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే 13 జిల్లాల‌ను 26గా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో పాటు జిల్లా కేంద్రాలు, రెవిన్యూ డివిజన్లు, జిల్లా పేర్ల‌ను వైసీపీ ప్ర‌భుత్వం వెల్ల‌డించిన సంగతి తెలిసిందే. కానీ ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌పై తీవ్ర‌స్థాయిలో అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కొన్ని జిల్లాల‌కు వేరే పేర్లు పెట్టాల‌నే డిమాండ్లు వినిపించాయి.

మ‌రోవైపు జిల్లా కేంద్రాల‌ను మార్చాల‌నే విన‌తులూ వ‌చ్చాయి. ఇక రెవిన్యూ డివిజ‌న్ల‌నూ పెంచాల‌ని సొంత పార్టీ నేత‌ల‌తో పాటు ప్ర‌తిప‌క్షాలు కోరాయి. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 11 వేల‌కు పైగా అభ్యంత‌రాలు, సూచ‌న‌లు వ‌చ్చినట్లు స‌మాచారం. వీట‌న్నింటినీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న జ‌గ‌న్ స‌ర్కారు.. ఫైన‌ల్ నోటిఫికేష‌న్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాల‌ని, ఓ జిల్లాకు దివంగ‌త న‌టుడు ఏఎన్నార్ పేరు పెట్టాల‌ని.. మ‌రో జిల్లాకు వంగ‌వీటి రంగా పేరు పెట్టాల‌ని.. ఇలా త‌దిత‌ర డిమాండ్లు వ‌చ్చాయి. కొత్త‌గా రెవెన్యూ డివిజ‌న్ల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పు, కొన్ని మండ‌లాల‌ను వేరే జిల్లాల్లో కొన‌సాగించ‌డం వంటి డిమాండ్లు ప్ర‌భుత్వానికి చేరాయి.

వీట‌న్నింటిపై ప్ర‌ణాళిక శాఖ అధికారుల‌తో రాష్ట్ర క‌మిటీ పూర్తి స్థాయిలో అధ్య‌య‌నం చేసి సీఎంకు రిపోర్ట్ అందజేసింది. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులపై జ‌గ‌న్ కూడా రివ్యూ చేశారు. ప్ర‌జ‌ల కోరిక మేర‌కు ముందుకెళ్లాల‌ని ఆయ‌న నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. అయితే జిల్లాల పేర్ల విష‌యంపై డిమాండ్ల‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తెలిసింది. ఒక్క బాలాజీ జిల్లాకు బ‌దులు తిరుప‌తి పేరుతోనే కొత్త జిల్లా ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఇక జిల్లా కేంద్రాల్లోనూ ఎలాంటి మార్పులు ఉండ‌వ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. కానీ రెవెన్యూ డివిజ‌న్ల‌ను పెంచే అవ‌కాశం ఉంది. గ‌తంలో ప్ర‌క‌టించినట్లు 11 కాకుండా మ‌రో నాలుగు కొత్త డివిజ‌న్లు ఏర్పాటు చేసే ఆస్కార‌ముంది. ఇప్ప‌టికే ఆయా జిల్లాల‌కు సంబంధించి కొత్త కార్యాల‌యాల ఎంపిక‌, ఏర్పాటు కూడా పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. ఉగాది నుంచి కొత్త జిల్లాల నుంచి పాల‌న చేయాల‌ని జ‌గ‌న్ భావించిన సంగ‌తి తెలిసిందే.

సాధ్య‌మైనంత వ‌ర‌కు ఇంటిగ్రేటెడ్ క‌లెక్ట‌రేట్‌లు ఉండేలా చూశారు. ప్ర‌భుత్వ భ‌వ‌నాలు అందుబాటులో లేని చోట్ల అద్దె భ‌వ‌నాల్లో తాత్కాలిక ఆఫీస్‌లు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది. ఇవాళ కొత్త జిల్లాల‌పై జ‌గ‌న్ తుది స‌మావేశం నిర్వ‌హించి ఆ త‌ర్వాత గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తార‌ని టాక్‌.