Begin typing your search above and press return to search.

మూడేళ్ల నుంచి మరేం చేస్తున్నట్లు బాలయ్య?

By:  Tupaki Desk   |   1 March 2017 12:30 AM GMT
మూడేళ్ల నుంచి మరేం చేస్తున్నట్లు బాలయ్య?
X
నేతల మాటలు మహా సిత్రంగా ఉంటాయి. ఎన్నికల్లో గెలిచేంత వరకూ చెప్పే మాటలకు.. గెలిచాక చేసే పనులకు సంబంధమే ఉండదు. తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బాలయ్య.. హిందూపురం రూపురేఖలు మార్చేస్తానని చాలానే మాటలు చెప్పేశారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న బాలయ్య మాటల్ని చాలానే నమ్మారు. అక్కున చేర్చుకున్నారు.

ఎమ్మెల్యేగా హిందూపురంలో ఇంటిని తీసుకొని.. నెలలో కొద్ది రోజులు నియోజకవర్గంలో గడుపుతానన్న బాలయ్య మాటలకు.. గెలిచిన తర్వాత ఆయన చేతలకు సంబంధమే లేదు. చివరకు పీఏను పెట్టుకొని.. తన ఎమ్మెల్యేగిరిని అతగాడికి దఖలు చేసిన వైనంతో.. చెలరేగిపోయి రచ్చ రచ్చ చేయటం.. చివరకు ఈ పంచాయితీ తేల్చేందుకు చంద్రబాబు.. లోకేశ్ రంగంలోకి దిగాల్సిన వైనాన్ని మర్చిపోలేం.

మరో మూడు నెలల వ్యవధిలో ఎమ్మెల్యేగా మూడేళ్ల పాలనను పూర్తి చేసుకోనున్న బాలయ్య.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ఏం చేశారన్నది చూస్తే.. ఏమీ లేదనే చెప్పాలి. ఆయన నుంచి ఎన్నో అంచనాలు వేసుకున్న ప్రజలు సైతం బాలయ్యపై అసంతృప్తితో ఉన్నారని చెబుతారు. తాజాగా హిందూపురంలో నేతలతో సమావేశమైన బాలకృష్ణ.. త్వరలో తాను నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నట్లుగా వెల్లడించారు.

నియోజకవర్గ పరిధిలో పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేతలపై సస్పెన్షన్ ను ఎత్తేసినట్లుగా ప్రకటించిన బాలకృష్ణ.. హిందుపురంలో తాను చెప్పిందే కరెక్ట్ అని.. సమస్యలన్నీ త్వరలో సర్దుకుంటాయని పేర్కొన్నారు. అంతా బాగానే ఉంది కానీ.. మూడేళ్లకు నియోజకవర్గం మీద పూర్తిస్థాయి దృష్టి పెడతానని చెప్పటం ఏమటన్నది ఒక ప్రశ్న. ఎన్నికలు మరో రెండేళ్లలో రానున్న వేళలోనే బాలయ్యకు నియోజకవర్గం మీద పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలన్న ఆలోచన రావటం ఏమిటో..?