Begin typing your search above and press return to search.

బాలయ్య.. సొంత పార్టీ కార్యకర్తను మళ్లీ కొట్టాడు

By:  Tupaki Desk   |   8 April 2019 4:40 AM GMT
బాలయ్య.. సొంత పార్టీ కార్యకర్తను మళ్లీ కొట్టాడు
X
ఆరాధించే వారిని తిట్టేయటం.. అభిమానించే వారిని చితక్కొట్టేయటం.. అప్యాయతను ప్రదర్శించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేయటం ఏ ప్రముఖుడైనా చేస్తాడా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నందమూరి బాలకృష్ణను గుర్తుకు తెచ్చుకుంటే సమాధానం సరిగా ఉంటుంది. తన తీరుతో తరచూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. వార్తల్లోకి ఎక్కే బాలయ్య తాజాగా అదే తీరుతో వ్యవహరించారు.

తనను విపరీతంగా అభిమానించే పార్టీ కార్యకర్తను నడిరోడ్డు మీద చితక్కొట్టేసిన వైనం ఇప్పుడు సంచలనంగానే కాదు.. సదరు వీడియో వైరల్ గా మారింది. కీలకమైన ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు చోటు చేసుకున్న ఈ ఉదంతం బాలయ్య మైండ్ సెట్ మీద సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రచారానికి బాలయ్య పాల్గొన్నారు.

బాలకృష్ణ ప్రచారానికి వస్తుంటే.. ఆ హడావుడే వేరు ఉంటుంది కదా. పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. జనసందోహం ఎక్కువగా ఉండి.. పొరపాటున ఒక కార్యకర్త బాలయ్యకు టచ్ అయ్యాడు. అంతే.. బాలయ్యలో కోపం కట్టలు తెంచుకుంది. తనలాంటి ప్రముఖుడ్ని ఒక సాదాసీదా వ్యక్తి టచ్ చేయటమా? అన్నట్లు ఆయన ప్రచార రథం దిగి మరీ.. కార్యకర్త కాలర్ పట్టుకొని అతడిని చితక్కొట్టేశారు. దీంతో పార్టీ కార్యకర్తలు.. అభిమానులు షాక్ కు గురయ్యారు.

ఇలాంటి చర్యలు బాలయ్యకు కొత్త కాదు. తనకు దగ్గర వచ్చిన వారిని..అభిమానంతో సన్నిహితంగా వచ్చే వాళ్లను.. తన చేతిని కానీ.. భుజాన్ని కానీ టచ్ చేస్తే బాలయ్యకు కోపం కట్టలు తెంచుకుంటుంది. మొన్నటికి మొన్న ఒక అభిమాని అభిమానంతో 60 వేల ఓట్ల మెజార్టీ వస్తుందంటే.. పక్కన భార్య ఉందన్న విషయాన్ని పట్టించుకోని బాలయ్య.. నోటికొచ్చినట్లు బూతులు తిట్టిన వీడియో హల్ చల్ చేయటం తెలిసిందే.

ఇలా.. తన తీరుతో తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారిన బాలయ్య తీరు కారణంగా..తెలుగు తమ్ముళ్లు ఇరకాటంలో పడుతున్నారు. ప్రచారానికి పిలివటమే పాపంగా మారిందని.. తాజా పరిణామంపై తెలుగుదేశం నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోనూ సరిగా చేసింది లేదు. నియోజకవర్గానికి చుట్టపు చూపుగా రావటం.. డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో బాలయ్య పట్టనట్లుగా వ్యవహరించటం.. స్థానిక సమస్యల పట్ల ఉదాసీనతతో వ్యవహరించిన వైనంతో స్థానిక ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. తన తీరుతో ఈసారి హిందూపురంలో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న బాలయ్యకు.. అక్కడి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఉత్కంటగా మారింది. బాలయ్యకు షాక్ తగిలేలా తీర్పు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందే తీర్పు చెప్పేయటం ఎందుకు?.. కాస్త ఓపిక పడితే ఫలితం అధికారికంగానే వస్తుంది.