Begin typing your search above and press return to search.

ఈ ఎన్నికల్లో అతి పెద్ద టెన్షన్ బాలకృష్ణ కేనా!

By:  Tupaki Desk   |   19 May 2019 4:53 AM GMT
ఈ ఎన్నికల్లో అతి పెద్ద టెన్షన్ బాలకృష్ణ కేనా!
X
ఒకటి తను గెలవడం గురించి - రెండోది పెద్దల్లుడి గెలుపు గురించి - మరోటి చిన్నల్లుడు గెలుపు గురించి - ఆ పై పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా.. అనే అంశం గురించి! ఇన్ని టెన్షన్లున్నాయి నందమూరి బాలకృష్ణకు. హిందూపురం నుంచి రెండో సారి పోటీ చేశారు బాలకృష్ణ. మొదటి సారి అంటే ఏదో గెలిచేశారు కానీ.. ఐదేళ్లలో బాలకృష్ణ ఎమ్మెల్యేగా అంతగా హిందూపురం ప్రజలను ఆకట్టుకున్నది లేదనే అభిప్రాయాలున్నాయి.

అడపాదడపా మాత్రమే హిందూపురానికి వెళ్తూ వచ్చాడు బాలకృష్ణ. గతంతో పోలిస్తే హిందూపురంలో బాలకృష్ణకు అంత సానుకూలత కనిపించడం లేదని ప్రీ పోల్ విశ్లేషణలు వినిపించాయి.

మరి తన గెలుపు మాత్రమే కాదు బాలకృష్ణ అంతకు మించిన టెన్షన్ అల్లుళ్ల గెలుపు విషయంలో ఉంది. వాళ్లిద్దరిలో ఎవరు ఓడిపోయినా బాలకృష్ణ కు ఒక రకంగా అవమానమే. వాళ్లింట్లో వాళ్లు ఆ ఓటమి గురించి ఫీల్ అయ్యే అవకాశాలున్నాయి.

మంగళగిరి నుంచి లోకేష్ పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. లోకేష్ తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ ఆశాకిరణం. ఏదైనా సేఫ్ జోన్ లో పోటీ చేసి ఉంటే ఇంత టెన్షన్ ఉండేది కాదేమో. మంగళగిరిని మొదట్లో సేఫ్ జోన్ అనుకున్నారు కానీ.. ఆ తర్వాత మాత్రం అక్కడ పరిస్థితి చాలా టఫ్ గా మారింది. లోకేష్ ఓడిపోతాడంటూ బెట్టింగులు సాగుతూ ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఇక తన చిన్నల్లుడు శ్రీభరత్ విజయం కూడా బాలకృష్ణకు అత్యంత కీలకమే. విశాఖపట్టణంలో శ్రీభరత్ పరిస్థితి ఏమిటనేది అంతుబట్టకుండా ఉంది. అక్కడ తెలుగుదేశం వాళ్లే జనసేన అభ్యర్థి లక్ష్మినారాయణకు సహకరించారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీభరత్ గెలుస్తారా? అనేది సందేహంగా మారడంతో పాటు.. ఆయనకు ఎన్నో స్థానం దక్కుతుందనే విశ్లేషణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.

ఇక సగటు తెలుగుదేశం కార్యకర్తలా బాలకృష్ణ కు పార్టీ విజయం కూడా కీలకమే. ఇలా పార్టీ - తను - ఇద్దరు అల్లుళ్లు.. ఇన్ని విజయాల విషయంలో నందమూరి బాలకృష్ణ టెన్షన్ పడుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫలితాల రోజు వరకూ ఇది తప్పకపోవచ్చు!