Begin typing your search above and press return to search.

బాలయ్యకు మచ్చ తెచ్చిన మాజీ పీఏకు జైలు శిక్ష

By:  Tupaki Desk   |   13 July 2019 6:29 PM GMT
బాలయ్యకు మచ్చ తెచ్చిన మాజీ పీఏకు జైలు శిక్ష
X
టాలీవుడ్ స్టార్, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ పరువును బజారుకీడ్చిన ఆయన మాజీ పీఏకు నిజంగానే ఇప్పుడు తగిన శాస్తి జరిగిందని చెప్పాలి. 2014 ఎన్నికల బరిలోకి దిగిన బాలయ్య... తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావును ఆదరించిన హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఓ వైపు సినీ ప్రస్థానం, మరో వైపు ఎమ్మెల్యే పదవి... రెంటినీ సమన్వయం చేసుకునే క్రమంలో బాలయ్య హిందూపురంలో ఓ పీఏను నియమించుకున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా పీఏలను నియమించుకుంటున్నా... బాలయ్య నియమించుకునే పీఏకు మరింత పని తప్పదు. ఎందుకంటే... అధిక సమయం హైదరాబాద్ లోనే ఉండే బాలయ్య... నియోజకవర్గంలో పనులన్నీ చక్కబెట్టాలంటే తాను నియమించుకునే పీఏ కీలకంగా వ్యవహరించాల్సిందే కదా.

ఈ క్రమంలో ఏరికోరి... తన బావ, పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో ఓ మోస్తరు అనుబంధం ఉందని భావించిన తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ఇంజినీర్ గా పనిచేస్తున్న శేఖర్ అనే వ్యక్తిని బాలయ్య తన పీఏగా నియమించుకున్నారు. బాలయ్య పీఏగా హిందూపురంలో ఎంట్రీ ఇచ్చీ ఇవ్వంగానే తన విశ్వరూపం చాటిన శేఖర్... బాలయ్యతో పాటు పార్టీ పరువును నిజంగానే బజారుకీడ్చారు. అప్పటిదాకా హిందూపురం టీడీపీలో కనిపించని అంతర్గత కుమ్ములాటలు, గొడవలు, కుంపట్లు పార్టీకి ముచ్చెమటలు పట్టించాయి. శేఖర్ వ్యవహారం బాలయ్యకు మరింతగా ఇబ్బంది తెచ్చిపెట్టింది. అయితే కాస్తంత ఆలస్యంగా మేల్కొన్న బాలయ్య... శేఖర్ ను తన పీఏ పదవి నుంచి తప్పించేశారు.

సరే... ఇదంతా తెలిసిన విషయమే అయినా... బాలయ్యను, టీడీపీని నానా ఇబ్బందులకు గురి చేసిన శేఖర్ కు ఇప్పుడు తగిన శాస్తి జరిగిందన్నట్లుగా జైలు శిక్షతో పాట జరిమానా కూడా విధిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడు రోజుల క్రితమే కోర్టు తీర్పు చెప్పినా... కాస్తంత ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయినా శేఖర్ కు ఎందుకు శిక్ష పడిందన్న విషయానికి వస్తే... పద్మావతి యూనివర్సిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శేఖర్... ఆ సమయంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఏసీబీ దాడులు జరిగాయి. ఈ క్రమంలో ఏసీబీ కేసు కూడా నమోదైంది. ఇదంతా 2008లో జరిగిందట. నాడు నమోదైన కేసు విచారణను పదేళ్లకు పైగానే కొనసాగించిన నెల్లూరు ఏసీబీ కోర్టు... ఎట్టకేలకు శేఖర్ ను దోషిగా తేల్చింది. ఈ క్రమంలో ఆయనకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానాను విధించింది.