Begin typing your search above and press return to search.

దర్శిలో విసిగి : బాలయ్యా.. ఇదేం గోలయ్యా...?

By:  Tupaki Desk   |   19 July 2022 3:30 PM GMT
దర్శిలో విసిగి : బాలయ్యా.. ఇదేం గోలయ్యా...?
X
తెలుగుదేశం పార్టీలో బాలయ్య పొలిట్ బ్యూరో సభ్యుడు. హిందూపురం నుంచి వరసగా రెండు సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే. ఇక అన్న ఎన్టీయార్ కి రాజకీయ వారసుడు. ఇలా ఎన్నో కొన్ని ప్రత్యేకతలు పార్టీలో ఆయనకు ఉన్నాయి. అదే టైమ్ లో బాలయ్యకు ఏపీవ్యాప్తంగా అభిమానులు అనుచరులు ఉన్నారు. ప్రకాశం జిల్లాలో అయితే ఆయనకు కొన్ని చోట్ల బలమైన నేతలు అనుచరులుగా ఉన్నారు. దాంతో ఎన్నికల వేళ బాలయ్యను కొందరు ఆశ్రయించి టికెట్ దక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి.

అలా ఇపుడు దర్శి నియోజకవర్గంలో బాలయ్య తలదూర్చి అక్కడ రాజకీయాన్ని తనదైన శైలిలో మార్చే ప్రయత్నం చేస్తున్నారు అన్న ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాలతో వ్యధ చెందిన దర్శి ప్రస్తుత ఇంచార్జి అయిన పాడిమి రమేష్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా ప్రకటించి టీడీపీలో లొల్లికి తెర లేపారు. విపక్ష పార్టీలో ఇలా కలకలం రేగడం అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.

అయితే దీని వెనక ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందిట. నిజానికి ప్రకాశం జిల్లాలో జరిగిన మహానాడు తరువాత నుంచే రమేష్ పార్టీపై విసిగిపోయారని చెబుతున్నారు. మహానాడుకు హాజరైన సుబ్బారావు ఒక ఎన్నారై దర్శి టికెట్ మీద మోజు పడడం, ఆయన చంద్రబాబుతో సమావేశం జరపడం, బాబు కూడా ఆయనకు టికెట్ మీద హామీ ఇవ్వడం జరిగిపోయాయని చెబుతున్నారు. ఈ పరిణామాలను దగ్గరుండి చూసిన రమేష్ తనకెందుకీ పార్టీ భారం అని తప్పుకున్నట్లుగా చెబుతున్నారు.

మహానాడు తరువాత నుంచి పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన రమేష్ రీసెంట్ గా పార్టీ ఆఫీస్ ని కూడా ఖాళీ చేశారు. దర్శిలో ఆ మధ్య జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీకి చుక్కలు చూపించారు రమేష్. మూడేళ్ళుగా ఆయన పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఆయనకే టికెట్ అని అనుచరులు భావిస్తున్నారు. అయితే సుబ్బారావు సడెన్ గా సీన్ లోకి వచ్చారు. మరి ఆయనకూ, దర్శికి బాలయ్యకు సంబంధం ఏంటి అంటే దర్శి నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన బాబూరావు బాలయ్యకు సన్నిహితుడు. 2019 ఎన్నికల్లో కూడా ఆయనకే బాలయ్య సిఫార్స్ చేశారు.

అయితే వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ చేతిలో ఆయన ఓడిపోయారు. ఆ తరువాత పార్టీని విడిచి వైసీపీలో చేరిపోయారు. నాటి నుంచి రమేష్ టీడీపీ కొమ్ము కాసుకుంటూ వస్తున్నారు. కానీ ఇవేమీ పట్టించుకోని బాలయ్య సుబ్బారావు అనే ఎన్నారైకి దర్శి టికెట్ కోసం సిఫార్స్ చేయడంతోనే రమేష్ కి మండింది అంటున్నారు. దాంతో ఆయన పార్టీ వైఖరి పట్ల విసిగి తప్పుకున్నారు అని చెబుతున్నారు

ఇక దర్శిలో అధికార వైసీపీ పరిస్థితి ఏమంత బాగా లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే వేణుగోపాల్ కి యాంటీగా అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇక జెడ్పీ చైర్ పర్సన్ గా బూచేపల్లి వెంకాయమ్మ ఉన్నారు. ఆమె కుమారుడే ఈ శివప్రసాదరెడ్డి. దాంతో దర్శిలో రెండు అధికార కేంద్రాలు నడుస్తున్నాయి. వర్గ పోరు తారస్థాయికి చేరుకుంది. ఈ పరిణామాలు సహజంగా టీడీపీకి బాగా కలసివస్తాయి.

కానీ టీడీపీ కూడా కష్టపడే వారికి మొదటి నుంచి పనిచేసే వారికి టికెట్ ఇవ్వకుండా ఎన్నారైలకు ఇవ్వాలని చూడడం వల్లనే రమేష్ కలత చెంది ఇలా చేశారు అని అంటున్నారు. అసలు దర్శి విషయంలో బాలయ్య జోక్యం ఏమిటి అన్న మాట కూడా తమ్ముళ్ళ నోట వస్తోంది. బంగారం లాంటి సీటు, గెలిచే దర్శిని అనవసరంగా బాలయ్య తలదూర్చి గొడవలు తెచ్చేలా చేస్తున్నారు అని అంటున్నారుట. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ బాలయ్య ఇదేంది గోలయ్యా అని దర్శిలో పాడుకుంటున్నారుట బాధగా రమేష్ అనుచరులు. చంద్రబాబు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దుతారేమో చూడాలి.