Begin typing your search above and press return to search.

మంత్రి హరీష్ ను సాయం కోరిన బాలయ్య.. సరేనన్న మినిస్టర్

By:  Tupaki Desk   |   10 Jan 2022 8:57 PM IST
మంత్రి హరీష్ ను సాయం కోరిన బాలయ్య.. సరేనన్న మినిస్టర్
X
నందమూరి అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును కలిశారు. మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన బాలకృష్ణ తాను చైర్మన్ గా ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సేవల గురించి వివరించారు. ఆస్పత్రికి అందిస్తున్న వైద్యసేవలు, అధునాతన సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు.

ఆస్పత్రి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నుంచి క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ కు సహాయ సహకారాలు అందించాలని కోరారు. బాలయ్య విజ్ఞప్తికి మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం మద్దతు ఉంటుందని ఆయనకు చెప్పినట్లు సమాచారం.

బాలయ్య వెంట డాక్టర్ ఆస్పత్రి సిబ్బంది సీఈవో డాక్టర్ ఆర్వీ ప్రభాకర్ రావు, ప్రతినిధులు ఉన్నారు. సినీ హీరోగా వెలుగొందుతున్న నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అలాగే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ గా ఎందరికో వైద్య సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎందరో పేదలకు బసవతారకం ఆస్పత్రి ద్వారా చికిత్స చేయిస్తూ ప్రాణాలను నిలబెడుతున్నారు. ఆయన ఆస్పత్రి అభివృద్ధి కోసం మంత్రిని కలిసినట్లు తెలుస్తోంది.

బసవతారకం ఆస్పత్రి చైర్మన్ గా ఉన్న బాలయ్య పార్టీలు, ప్రభుత్వాలకు అతీతంగా అందరినీ కలుస్తూ సాయం అర్థిస్తూ ఆస్పత్రిలో ఉచిత సేవలు అందస్తూ అందరి మనసు చూరగొంటున్నారు. తాజాగా తెలంగాణ మంత్రిని కలిసి సహాయమందించమని కోరారు. మంత్రి హరీష్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కావడంతో బాలయ్య సహాయం కోరారు.