Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను బాలయ్య పొగిడేశారు

By:  Tupaki Desk   |   19 Aug 2016 6:21 AM GMT
కేసీఆర్ ను బాలయ్య పొగిడేశారు
X
గత ఏడాది జరిగిన గోదావరి మహా పుష్కరాలతో పోలిస్తే ఈ ఏడాది జరుగుతున్న కృష్ణా పుష్కరాలు కాసింత నీరసంగానే సాగుతున్నట్లు చెప్పాలి. గోదావరి పుష్కరాల సమయంలో వచ్చి పోయే ప్రముఖులకు.. యాత్రికులకు తెంపు ఉండేది కాదు. నిత్యం లక్షల్లో పుష్కర స్నానం చేయటం.. రోజు గడిచిన వెంటనే తమ రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది యాత్రికులు స్నానాలు చేశారంటే.. మా రాష్ట్రంలో ఇన్ని లక్షల పుష్కరస్నానాలు జరిగినట్లుగా ఆయా ప్రభుత్వాలు ప్రకటనలు విడుదల చేసేవి. కానీ.. ఈసారి మాత్రం అలాంటిదేమీ కనిపించని పరిస్థితి. గోదావరి పుష్కరాలతో పోలిస్తే.. కృష్ణా పుష్కరాల సందర్భంగా రద్దీ తక్కువగా ఉండటంతో.. తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దగా దృష్టి పెట్టటం లేదన్న మాట వినిపిస్తోంది. అయితే.. పుష్కర పర్యవేక్షణ బాధ్యతలు మంత్రులకు అప్పజెప్పిన నేపథ్యంలో ఆయన కూల్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.

ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కృష్ణా పుష్కరాల ఏర్పాట్ల పనుల్లో కిందామీదా పడిపోతున్నారు. నిద్రాహారాలు మానేసి ఆయన విపరీతంగా శ్రమిస్తున్నారు. ఆయన శ్రమకు తగ్గట్లే కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు బాగున్నాయంటూ ప్రముఖులు కితాబులిస్తున్నారు. ఏపీ పుష్కర ఏర్పాట్లు బాగున్నాయంటూ పలువురు పొగిడేస్తుంటే.. తెలంగాణలో అలాంటి వాతావరణం ఏదీ కనిపించని పరిస్థితి. ఈ లోటు తాజాగా తీరిపోయింది. సినీ నటులు.. అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మహబూబ్ నగర్ జిల్లా సోమశిల పుష్కరఘాట్ లో పుష్కర స్నానం ఆచరించారు. ఆయనతో పాటు.. ఆయన సతీమణి.. అక్క లోకేశ్వరి.. చిన్నసోదరి ఉమామహేశ్వరి.. ఆమె భర్త శ్రీనివాసప్రసాద్ లతో కలిసి వీఐపీ ఘాట్ లో పుష్కర స్నానం చేశారు.

ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు పిండ ప్రధానం చేశారు. బాలకృష్ణ పుష్కర స్నానానికి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ మంత్రి జుపల్లి స్వాగతం పలికి.. ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణలో పుష్కర ఏర్పాట్లు చాలా బాగున్నాయని.. తెలంగాణ ప్రభుత్వం చక్కటి ఏర్పాట్లు చేసిందంటూ కితాబునిచ్చారు. పుష్కరాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లపై ప్రముఖులు ఎవరూ కాంప్లిమెంట్లు ఇవ్వలేదని ఫీలవుతున్న పలువురికి బాలయ్య కాంప్లిమెంట్ సంతోషాన్ని కలిగించటం ఖాయం.