Begin typing your search above and press return to search.

చనిపోయిన మా తాత కోరిక తీరుస్తా..విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తా

By:  Tupaki Desk   |   15 Feb 2019 4:17 PM GMT
చనిపోయిన మా తాత కోరిక తీరుస్తా..విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తా
X
విశాఖలో ఎంవీవీఎస్ మూర్తి పేరు తెలియనివారు లేరు. ఎంపీగా - ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన్ను అంతా ఆయన విద్యాసంస్థల పేరుతో గీతమ్ మూర్తి అంటారు. గత ఏడాది చివర్లో అనూహ్యంగా అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆయన తన మరణానికి కొద్ది ముందు మనవడు శ్రీభరత్‌ను ఎంపీగా విశాఖ నుంచి పోటీ చేయమని సూచించారట. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు భరత్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలోనే మూర్తి మరణించడంతో కొద్దినెలల పాటు ఆ కార్యక్రమం వాయిదా వేసుకున్నప్పటికీ ఇప్పుడాయన కోరిక తీర్చేందుకు గాను భరత్ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని చెబుతున్నారు.

ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణకు చిన్నల్లుడైన భరత్ రాజకీయ ప్రవేశం ఆయన తోడల్లుడు నారా లోకేశ్ చేతిలోనే ఉంది. అయితే.. భరత్ మాత్రం ఎంపీగా తానెందుకు పోటీ చేయాలనుకుంటున్నాను... తన లక్ష్యమేంటనేది ఇటీవల వెల్లడించారు.

‘‘చిన్నప్పటి నుంచి మా ఇద్దరు తాతలను చూసి పెరిగాను. పుట్టినప్పటి నుంచి 2014 వరకు ఇద్దరు తాతల్లో ఎవరో ఒకరు పార్లమెంటులో ఉన్నారు. సో.. ఒక ఎంపీ జీవితం ఎలా ఉంటుంది.. ఏమేమి చేయొచ్చు.. వారి యాక్టివిటీ ఎలా ఉంటుందని చూశాను. నా చదువు, నా పనితీరు అన్నీ చూసుకుంటే నా ఐడియాలజీకి ఎంపీ పదవి అయితే బాగా సూటవుతుందన్న అభిప్రాయం ఉంది. 2018లో ఈ విషయం మూర్తిగారితో(తాతతో) డిస్కస్ చేసినప్పుడు ఎంపీగా పోటీ చేయాలి నిర్ణయించుకున్నాం. అక్టోబరులో ప్రత్యేకంగా ఒక ఇల్లు తీసుకుని పనిచేయాలనుకున్నాం. ఈలోగా ఆయన చనిపోయారు. దాంతో అంతా షాకయ్యాం.

నెల తరువాత మా ఆలోచనను ఆచరణలోకితేవాలనుకున్నాం. మూర్తిగారి పాత్ర విశాఖలో చాలా కీలకంగా ఉండేది. టీడీపీలో ఉత్తరాంధ్రకు పెద్దదిరక్కుగా ఉండేవారు. కాబట్టి ఆయన తరువాత కూడా కుటుంబం నుంచి ఎవరో ఒకరం ఆయన ఆశయాలు నెరవేర్చాలని నిర్ణయించాం. నా ఆలోచనలు తాత ఆలోచనలకు దగ్గరగా ఉంటాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ ఏది మంచిదో ఆలోచించి అదేపని చేస్తాను. ప్రజలకు లాయల్టీగా ఉంటాను. మూర్తిగారు ఇలాగే ఆలోచించేవారు. నేనూ అలాగే చేస్తాను.

నేనేమీ అవకాశవాదిని కాను. మూర్తిగారు నాకోసం ఏ పాత్ర అనుకుంటున్నారో అదే చేయాలనుకుంటున్నా. విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని పార్టీకి చెప్పాను. పార్టీ నిర్ణయమే శిరోధార్యం. వారి నిర్ణయం ప్రకారం నడుచుకుంటాను. ఇక పార్టీ పరిస్థితి గురించి మాట్లాడితే అంతా బాగానే ఉంది. నేను అన్నీ పాజిటివ్‌గా చూస్తాను కాబట్టి నాకు అంతా బాగున్నట్లే ఉంది. రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలి. అవన్నీ సీఎం బ్రెయిన్ చైల్డ్స్. అవన్నీ మధ్యలో ఆగిపోవడం రాష్ట్రానికి మంచిది కాదు .అది చేయగలిగేది సీఎం చంద్రబాబు ఒక్కరే అని నమ్ముతున్నారు. కాబట్టి ఆయన మళ్లీ సీఎం కావడం ఈ రాష్ట్రానికి చాలా అవసరం’’ అని శ్రీభరత్ చెప్పారు