Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: హిందూపురం

By:  Tupaki Desk   |   25 March 2019 10:37 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్:  హిందూపురం
X
– టీడీపీ కంచుకోట బీటలు పారే పరిస్థితి
– పటిష్టంగా వైఎస్సార్‌ సీపీ నేతల ప్రచారం

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా మారింది. అభ్యర్థి ఎవరనేది పక్కన పెడితే పార్టీ గుర్తుపై గెలిచిన నాయకులు ఎందరో ఉన్నారు. 1983 నుంచి 2014 వరకు జరిగిన ప్రతి ఎన్నికలో టీడీపీ అభ్యర్థులు గెలుస్తూనే వచ్చారు. అయితే ఈసారి సమపోరు నెలకొంది. టీడీపీ - వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ఎవరు గెలుస్తారనేది చివరి నిమిషం కూడా చెప్పలేని పరిస్థితి.

అయితే జనాల నాడి ప్రకారం టీడీపీ కోట బీటలు పారే పరిస్థితి ఉందని తెలుస్తోంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌ టీ రామారావు 1985 - 1989 - 1994 ఎన్నికల్లో హిందూపురం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అదేవిధంగా 1996లో ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణ పోటీ చేసి గెలిచారు. అనంతరం 1999లో సీసీ వెంటకరాముడు - 2004లో రంగనాయకులు - 2009లో అబ్దుల్‌ ఘనీ - 2014లో నందమూరి బాలకృష్ణ గెలిచారు.

అయితే 1999 నుంచి మెజార్టీ తగ్గుతూ వస్తున్నా.. 2014లో మళ్లీ వేగం పుంజుకుంది. అయితే ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఎవరికీ అర్థం కాని విషయం. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వర్సెస్‌ ఇక్బాల్‌ అహమద్‌ మధ్య పోటీ నెలకొంది.

టీడీపీ ప్రత్యర్థి నవీన్‌ నిశ్చలే..

హిందూపురంలో టీడీపీ ఏకపక్షంగా హవా సాగిస్తున్నప్పటికీ నవీన్‌ నిశ్చల్‌ రాకతో టీడీపీపై భారీ వ్యతిరేకత ఏర్పడింది. 2004లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన నవీన్‌ నిశ్చల్‌ స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అయితే తర్వాత ఐదేళ్ల కాలంలో టీడీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లా కాంగ్రెస్‌ ను పతాకస్థాయికి తీసుకెళ్లారు. అయితే 2009లో కాంగ్రెస్‌ నుంచి నవీన్‌ నిశ్చల్‌ కు టికెట్‌ రాలేదు. కానీ నవీన్‌ నిశ్చల్‌ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగి కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్‌ మూడోస్థానంలో సరిపెట్టుకుంది.

అనంతరం 2014లో నవీన్‌ నిశ్చల్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ అనంత జిల్లా వ్యాప్తంగా టీడీపీ హవా ఉండటంలో నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు. అయితే నవీన్‌ నిశ్చల్‌ నాలుగేళ్ల పాటు ప్రజల్లో ఉంటూ వైఎస్సార్‌ సీపీని బలోపేతం చేశారు. కానీ పార్టీ అధిష్టానం ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. ఆయన స్థానంలో టీడీపీ నుంచి వచ్చిన అబ్దుల్‌ ఘనీని ఇన్‌ చార్జ్‌ గా నియమించింది. అయితే ఆయన కూడా చేతులెత్తేయడంతో కర్నూలు జిల్లాకు చెందిన ఇక్బాల్‌ అహమద్‌ ఖాన్‌ ను అభ్యర్థిగా ప్రకటించింది.

పంచపాండవులులా.. బరిలోకి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన అభ్యర్థి ఇక్బాల్‌ అహమద్‌ ఖాన్‌ తరఫున వైఎస్సార్‌ సీపీ స్థానిక నాయకులు నవీన్‌ నిశ్చల్ - కొండూరు వేణుగోపాల్‌ రెడ్డి - చౌళూరు రామకృష్ణారెడ్డి - అబ్దుల్‌ ఘనీ ప్రచారం చేస్తున్నారు. ఇక్బాల్‌ గెలుపు స్థానిక నేతలపై ఆధారపడి ఉందని చెప్పవచ్చు. దీనికి తోడు బాలయ్యపై వ్యతిరేకత ఎక్కువగా ఉండటం.. గత నాలుగేళ్లుగా బాలయ్యపై నవీన్‌ నిశ్చల్‌ పోరాటం.. వైఎస్సార్‌ సీపీ గెలుపునకు కలిసొస్తాయి. ఫలితంగా రాష్ట్రంలో అందరి దృష్టి హిందూపురంపై మళ్లింది. ఈసారి టీడీపీ కంచుకోట బీటలు పారుతుందా.. లేక యథావిధిగా పురం ఓటర్లు టీడీపీకే పట్టం కడుతారో చూడాలి.

కోల్డ్‌ వార్‌ జరిగితే కష్టమే

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఇక్బాల్‌ అహమద్‌ హిందూపురం నుంచి గెలిస్తే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని స్థానిక వైఎస్సార్‌ సీపీ నేతలు నవీన్‌ నిశ్చల్ - వేణుగోపాల్‌ రెడ్డి - చౌళూరు రామకృష్ణారెడ్డి - అబ్దుల్‌ ఘనీ భావిస్తే గెలుపు కష్టమని చెప్పవచ్చు. కానీ పార్టీ అధిష్టానం సూచన మేరకు నడుచుకుంటే సంచలనం సృష్టించే అవకాశం ఉంది. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆర్థికంగా అంత సత్తా కనిపించడం లేదని స్థానికుల నుంచి విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈసారి కూడా బాలయ్యకు చాన్స్‌ లేకపోలేదు. ఫలితంగా పురంలో పోరు సమంగా ఉందని చెప్పవచ్చు.