Begin typing your search above and press return to search.

బాల‌య్య స‌తీమ‌ణికి హిందూపురం ఓట‌ర్లు అలా చెప్పారట‌!

By:  Tupaki Desk   |   26 March 2019 5:12 AM GMT
బాల‌య్య స‌తీమ‌ణికి హిందూపురం ఓట‌ర్లు అలా చెప్పారట‌!
X
ప్ర‌జాస్వామ్యంలో ఎన్నిక‌ల వ్య‌వ‌స్థను పెట్టినోడిని అభినందించాల్సిందే. ఆకాశంలో మాత్ర‌మే న‌డిచే తార‌లు.. స‌మాజంలో అత్యుత్త‌మ ప‌వ‌ర్ ఉన్న వారు సైతం.. క‌నీసం ఐదేళ్ల‌కు ఒక‌సారైనా సామాన్యుల చెంత‌కు వ‌స్తూ.. బాబ్బాబు.. ఓటు వేయండ‌ని అడుతుగుతున్నారంటే.. అది ఎన్నిక‌ల పుణ్య‌మే. ఎన్నిక‌లు ఇప్పుడున్న రీతిలో లేకుంటే ఇలాంటివి సాధ్య‌మ‌య్యేప‌నేనా?

ఎన్నిక‌ల్లో గెలిచి.. అధికారం చేతికి వ‌చ్చాక‌.. జ‌నాల‌కు క‌నిపిస్తారా? లేదా? అన్న‌ది ప‌క్క‌న పెడితే.. ఎన్నిక‌ల వేళ‌లో మాత్రం త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావ‌టం.. ప్ర‌చారం జ‌రిగిన‌న్ని రోజులు ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌టం.. సామాన్యుల మ‌న‌సును దోచుకునేలా వ్య‌వ‌హ‌రించ‌టం చేస్తుంటారు.

ఐదేళ్లు హిందూపురం ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రించిన బాల‌య్య‌.. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురానికి ఎన్నిసార్లు వెళ్లారు? ఎన్ని రోజులు గ‌డిపార‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే. ఆయ‌నే అలా ఉంటే.. ఎన్నిక‌ల వేళ బాల‌య్య త‌ర‌ఫు ప్ర‌చారం చేసే ఆయ‌న స‌తీమ‌ణి.. విడి రోజుల్లో నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల‌తో ట‌చ్ లో ఉన్నారా? లేదా? అన్న ప్ర‌శ్న వేసుకోవాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంలోనూ భ‌ర్త త‌ర‌ఫు ప్ర‌చారానికి వ‌చ్చిన వసుంధ‌రాదేవి.. తాజా ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ పాలు పంచుకుంటున్నారు. హిందూపురం ఓట‌ర్ల‌ను క‌లుస్తూ.. త‌న భ‌ర్త‌కు ఓటు వేయాల‌ని కోరుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ.. మ‌హిళ‌ల‌కు బొట్టు పెడుతూ ఓట్లు వేయాల‌ని కోరుతున్నారు. తాను ప్ర‌చారానికి వెళ్లిన స‌మ‌యంలో.. అక్క‌డి వారంతా త‌మ‌ను ఓట్లు అడ‌గాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని.. తమ ఓట్లు అన్ని టీడీపీకే వేస్తామ‌ని చెబుతున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు.

గ‌తం కంటే ఎక్కువ మెజార్టీ ఖాయ‌మ‌న్న ధీమాను వ్య‌క్తం చేస్తున్న ఆమె.. హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధాన స‌మ‌స్య అయిన నీటి స‌మ‌స్య‌ను తీర్చిన త‌ర్వాతే తాము ఓట్లు అడుగుతున్న‌ట్లు చెప్పారు. తాను ప్ర‌చారం చేస్తున్న వేళ‌.. త‌మ మ‌ద్ద‌తు టీడీపీకే అని ప్ర‌జ‌లు చెబుతున్న‌ట్లు చెప్పారు. గ‌తానికి మించిన భారీ మెజార్టీ ఖాయ‌మ‌న్న ధీమాను వ్య‌క్తం చేస్తున్న ఆమె.. ప్ర‌జ‌లు తాము అడ‌గ‌కుండానే ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌న్ని అందుతున్న‌ట్లు చెప్పార‌న్నారు.

ప్ర‌చారంలో భాగంగా.. కాసేపు ఇస్త్రీ చేసిన బాల‌య్య స‌తీమ‌ణి అక్క‌డి వారిని ఆక‌ట్టుకున్నారు. మండుతున్న ఎండ‌ను లెక్క చేయ‌కుండా తిరుగుతున్న వ‌సుంధ‌ర మేడ‌మ్‌ ను చూస్తే ఒక్కటి మాత్రం గుర్తుకు రాక మాన‌దు. ఎన్నిక‌ల ప్ర‌చారం వేళ‌.. ఇంత‌లా శ్ర‌మించే ఆమెలాంటి వాళ్లు.. ఎన్నిక‌లు అయ్యాక ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు క‌నుక్కోవ‌టం.. వారి క‌ష్ట‌సుఖాల గురించి ఆరా తీస్తూ.. వాటి ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నిస్తే.. ఎన్నిక‌ల ప్ర‌చార వేళ ఇంత‌లా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దేమో క‌దా?