Begin typing your search above and press return to search.

వార్ వ‌న్ సైడ్ వేళ బాల‌య్య ఎలా గెలిచారు?

By:  Tupaki Desk   |   24 May 2019 6:47 AM GMT
వార్ వ‌న్ సైడ్ వేళ బాల‌య్య ఎలా గెలిచారు?
X
ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంద‌న్న అంచ‌నా ఉన్న‌ప్ప‌టికీ.. ఇంత భారీ మెజార్టీతో గెలుస్తుంద‌న్న అంచ‌నాను ఏ ఒక్క‌రూ వేయ‌లేక‌పోయారు. ఏపీలోని 175 స్థానాల్లో 151 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ జ‌య‌కేత‌నం ఎగుర‌వేయ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం పార్టీ నేత‌లే కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు సైతం త‌మ‌కు ల‌భించిన విజ‌యాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న ప‌రిస్థితి.

ఇంత‌టి వేవ్ లో.. అనంత‌పురం జిల్లా హిందూపురంలో టీడీపీ ఎలా గెలిచింద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద‌గా ఉండ‌క‌పోవ‌టం.. అప్పుడ‌ప్పుడు చుట్టం చూపుగా వెళ్లే బాల‌య్య రెండోసారి గెల‌వ‌టంపై ప‌లువురు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ఎంతో మంది ప్ర‌ముఖుల‌కు త‌ప్ప‌ని ఓట‌మి ముప్పు నుంచి బాల‌య్య ఎలా బ‌య‌ట‌ప‌డ్డార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

బాల‌య్య గెలుపు వెనుక బ‌ల‌మైన టీడీపీ పునాదే కార‌ణంగా చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచిన‌ప్ప‌టికి.. బాల‌కృష్ణ గెల‌వ‌టం వెనుక‌.. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ మీద అక్క‌డి ప్ర‌జ‌ల్లో ఉండే అభిమాన‌మే కార‌ణంగా చెప్ప‌క త‌ప్ప‌దు. సిట్టింగ్ ఎమ్మెల్యే బాల‌కృష్ణ విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. అంత‌కు ముందు వ‌రుస‌గా తొమ్మిది సార్లు తెలుగుదేశం పార్టీ విజ‌యంసాధిస్తుండ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇక్క‌డ జ‌రిగే ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ టీడీపీనే విజ‌యం సాధిస్తూ వ‌స్తోంది. తాజా విజ‌యం ఆ కోవ‌కే చెందుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా.. బ‌ల‌మైన వ్య‌తిరేక గాలి వీసిన‌ప్ప‌టికి బాల‌కృష్ణ విజ‌యం ఒక రికార్డు అయితే.. వ‌రుస‌గా తొమ్మిదో సారి టీడీపీ హిందూపురంలో గెల‌వ‌టం మ‌రో రికార్డుగా చెప్పక త‌ప్ప‌దు.

నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ‌గా ఉండ‌న‌ప్ప‌టికీ.. నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన ప‌లు ప‌నులను పూర్తి చేయించిన విష‌యంలో బాల‌కృష్ణ ప‌నితీరును అక్క‌డి వారు మెచ్చుకోవ‌టం క‌నిపిస్తుంది. హంద్రీనీవా ద్వారా చెరువుల్లో నీళ్లు నింప‌టానికి రూ.194 కోట్ల‌తో గొల్ల‌ప‌ల్లి నుంచి హిందూపురానికి తాగునీటి పైపులైను.. హిందూపురంలో రూ.23 కోట్ల‌తో కూర‌గాయ‌ల మార్కెట్ నిర్మాణం.. రూ.66కోట్ల‌తో రోడ్ల నిర్మాణం.. రూ.75 కోట్ల‌తో హిందూపురంలో వాట‌ర్ ట్యాంకులు.. పైపులైను నిర్మాణంతో పాటు రూ.320 కోట్ల‌తో జాతీయ ర‌హ‌దారి ప‌నులు చేయించ‌టం లాంటి కార్య‌క్ర‌మాలు పెద్ద ఎత్తున చేయించ‌టంతో బాల‌కృష్ణ గెలుపున‌కు తిరుగులేకుండా పోయింది.

అదే స‌మ‌యంలో నంద‌మూరి కుటుంబానికి అండ‌గా హిందూపురం నిలిచింది. స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు కానీ.. బాల‌య్య సోద‌రుడు దివంగ‌త హ‌రికృష్ణ గెలుపు సాధ్య‌మ‌య్యేలా చేసిన హిందూపురం మ‌రోసారి నందమూరి కుటుంబం ప‌ట్ల త‌మ‌కున్న అభిమానాన్ని అక్క‌డి ఓట‌ర్లు ప్ర‌ద‌ర్శించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.